ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (10:30 IST)

ఐరెన్ లెగ్ అంటూ ప్రచారం చేస్తే... జగనన్న మంత్రిని చేశారు : ఆర్కే.రోజా

rkroja
తనది ఐరెన్ లెగ్ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేశారనీ, కానీ, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తనను ఏకంగా మంత్రిని చేశారంటూ సినీ నటి ఆర్కే.రోజా భావోద్వేగంతో చెప్పారు. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రోజా.. టీడీపీ నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇపుడు ఏపీ మంత్రిగా నియమితులయ్యారు. 
 
టీడీపీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీలోకి మారిన తర్వాత కానీ... ప్రత్యర్థులపై ఆమె విరుచుకు పడిన తీరు ఒక రేంజ్‌లో ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజా... పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. ఆమె అంకితభావాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్... ఆమెను మంత్రి పదవికి ఎంపిక చేశారు. 
 
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి లభించినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై తన అభిమానం రెట్టింపయిందని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖను కేటాయించినా సమర్థవంతంగా పని చేస్తానని తెలిపారు. 
 
ఇదేసమయంలో ఆమె సంచలన ప్రకటన చేశారు. సినిమాలకు, జబర్దస్త్ షోకు గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. మంత్రిగా పూర్తి సమయాన్ని తాను వెచ్చించాల్సి ఉంటుందని... ఈ సమయంలో సినిమాలు, షోలకు సమయం కేటాయించలేనని ఆమె తెలిపారు. మంత్రి అవడంతో ఇక షూటింగులు మానేస్తున్నానని చెప్పారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు.