శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 25 నవంబరు 2024 (14:52 IST)

చెవిరెడ్డి కూడా నాకు చెప్పేవాడా? నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోలేరు: బాలినేని కామెంట్స్

balineni srinivasa reddy
వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనను విమర్శించడంపై జనసేన నాయకుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ... చెవిరెడ్డి కూడా నా రాజకీయ విలువలు గురించి మాట్లాడే స్థాయికి వచ్చారా? నేను విలువలతో కూడిన రాజకీయాలు చేసాను. నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.
 
ఆయన మరణించిన తర్వాత అన్ని పదవులు వదిలేసి వైసిపిలో చేరాను. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కేవలం జగన్ ఒక్కరేనా? విజయమ్మ, షర్మిలను పట్టించుకోరా? వారిపై అసభ్యకరమైన పోస్టులు పెడితే వాళ్లెవరో అన్నట్లు పట్టింకోరా. నేను ఎవరి మెప్పుకోసం పనిచేయడంలేదు. ప్రజా సేవకే ప్రాధాన్యతనిస్తాను. తిట్టినవారికే టిక్కెట్లు ఇచ్చే సాంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.
 
జనసేన పార్టీలో చేరిన తర్వాత నేను ఎవ్వరినీ విమర్శించనని చెప్పాను. నాపై వ్యక్తిగత విమర్శలకు దిగితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. అదానీతో విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో నేనే విద్యుత్ మంత్రిని కనుక దానిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత నాపై వుంది. అందుకే నేను చెప్పాల్సి వచ్చింది. సెకీ ఫైల్ నావద్దకు రాలేదు. వాస్తవాలు ఏం జరిగాయో తేల్చుకునేందుకు బహిరంగంగా మాట్లాడాలంటే ముఖాముఖి చర్చకు సిద్ధం. మీరు సిద్ధంగా వుంటే చెప్పండి. నేను వ్యక్తిగత విమర్శలకు దిగి నిజాలు చెప్పడం ప్రారంభిస్తే ఎవ్వరూ తట్టుకోలేరు." అని అన్నారు.