శివ శివా... ఆలయంలో అర్చడుకిని కాలితో తన్ని, బూతులు తిట్టిన వైకాపా నేత... ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు పెట్రేగిపోతున్నారు. అధికారమదంతో రెచ్చిపోతున్నారు. బహిరంగ ప్రదేశం, ఆలయం ఇలా ప్రదేశం ఏదైనా సరే తమ మాటకు అడ్డు చెప్పినవారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. తాజాగా శివాలయంలో పరమేశ్వరుడి సాక్షిగా వైకాపా నేత ఒకరు ఇద్దరు అర్చకులపై దాడి చేశారు. వేదమంత్రోచ్ఛారణ చేసే పూజారులను కాలితో తన్నారు. ఆలయంలోనే బూతుపురాణం లంఘించాడు. ఆ బూతులు విన్న ఇతర భక్తులు చెవులు మూసుకున్నారు. ఈ ఘటన కాకినాడలోని గాంధీ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఫాల్గుణ పౌర్ణమికితోడు సోమవారం కావడంతో కాకినాడలోని పెద్ద శివాలయానికి భక్తులు పోటెత్తారు. అదేసమయంలో మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజాసామగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని, అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు.
సహాయ అర్చకుడు పి.వెంకటసత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకూ ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడై ఆయన చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి, కాలితో తన్నడంతో ఆయన కింద పడ్డారు. వైకాపా నాయకుడి కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మద్దిరాల విజయకుమార్ వచ్చి అడ్డుకోబోగా ఆయన చెంపపై కూడా కొట్టారు. అసభ్యపదజాలంతో దూషించడమేకాక మీ అంతుచూస్తానంటూ వీరంగం సృష్టించారు. ఈ తతంగానికి భక్తులు నివ్వెరపోయారు.
ఈ ఘటనను జిల్లా అర్చక సంఘం ప్రతినిధులు దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా దేవాదాయ అధికారి పులి నారాయణమూర్తి, తనిఖీదారు ఫణీంద్రకుమార్తో పాటు డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. పులి నారాయణమూర్తిని అది తనకు సంబంధించిన విషయం కాదని, డిప్యూటీ కమిషనర్‌ను వెళ్లి కలవాలని సూచించడంతో అర్చకులు ఆందోళనకు దిగారు. అర్చకుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫణీంద్రకుమార్ ఘటనపై ఆరా తీశారు. ఉన్నతాధికారుల సూచనలతో ఆలయ ఈవో రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు (అర్చకులపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే నేరాలపై సెక్షన్ 332 కింద సీఐ సురేశ్ బాబు కేసు నమోదు చేశారు. అయితే, కేసు వెనక్కి తీసుకోవాలంటూ వైకాపా నేతలు అర్చకులపై ఒత్తిడి తెస్తున్నారు. పోలీసులు సైతం చంద్రరావుకే వత్తాసు పలుకుతున్నారు.