సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (17:12 IST)

రమణ దీక్షితులు రాజకీయాలు చేయరాదు.. సలహాలు ఇవ్వాలి : వైవీ సుబ్బారెడ్డి

కరోనా నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు వున్నా శ్రీవారికీ నిర్వహించే కైంకర్యాలు ఉత్సవాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా వైభవంగా  నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భక్తుల సహకారంతో ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు శ్రీవారి దర్శనాని కల్పిస్తున్నామన్నారు. రాబోయే రోజులలో కూడా ఇలాగే భక్తులకు దర్శనాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. 
 
టీటీడీ విషయంలో రమణదీక్షితులు రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. రమణ దీక్షితులుని ముఖ్యమంత్రి జగన్ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారని గుర్తుచేశారు. అర్చకుల విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 
 
రమణదీక్షితులుని పిలిచి మాట్లాడమని అధికారులతో చెప్పానని తెలిపారు. టీటీడీకి ఆయన ఆగమ సలహాదారుడు కూడా అని గుర్తుచేశారు. ఆయన ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే టీటీడీ బోర్డుకు ఇవ్వాలని... మీడియా ముఖంగా మాట్లాడటం సరికాదని సుబ్బారెడ్డి అన్నారు.
 
కాగా, తిరుమల అర్చకులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు 15 మంది అర్చకులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని... మరో 25 మంది రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు. 
 
తిరుమలలో భక్తులకు దర్శనాలు వద్దని తాను చెపుతున్నా టీటీడీ ఈవో, ఏఈవో పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వీరిద్దరూ ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలనే పాటిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పై విధంగా వ్యాఖ్యానించారు. 
 
ఇదిలావుంటే, తితిదే పాలకమండలి ఛైర్మన్‌ని అర్చక బృందం కలిసింది. అర్చకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ ఎలా వ్యాపించిందో తెలియడం లేదన్నారు. భక్తులు వలన అర్చకులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. 
 
క్యూ లైనుకు సమీపంలో అర్చకులు విధులు నిర్వహించడం లేదన్నారు. ఆరోగ్య రీత్యా అర్చకులకు బదిలి సౌకర్యం కల్పించాలని టీటీడీ అనుమతి కోరామని వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు.