గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:44 IST)

పసిబిడ్డను నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేశారు..

నిద్రపోతున్న ఆరు నెలల మగ శిశువును నీళ్ల డ్రమ్‌లో వేసి దారుణంగా హత్య చేసారు. ఉయ్యాలలో బిడ్డ కనిపించకపోవడంతో తల్లి, బంధువులు అందరూ కలిసి వెతకగా నీళ్ల డ్రమ్‌లో శవమై తేలి ఉన్నాడు. ఈ ఘటన శ్రీరంగరాజపురం మండలం పిల్లిగుండ్లపల్లె ఒంటిల్లులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం పిల్లిగుండ్లపల్లె ఒంటిల్లు దళితవాడకు చెందిన భువనేశ్వరి(22), అదే మండలానికి చెందిన ఎగువమెదవాడ దళితవాడకు చెందిన వినోద్‌కుమార్‌(27) ప్రేమించుకున్నారు. 
 
పెద్దలను ఎదిరించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వినోద్‌కుమార్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆమె ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. రెండవ కొడుకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెను చేరదీశారు. దాంతో భువనేశ్వరి పిలిగుండ్లపల్లె ఒంటిల్లులోని అమ్మగారింటికి వచ్చింది. సమీప బంధువు చనిపోవడంతో తల్లిదండ్రులు అంత్యక్రియలకు వెళ్లారు. 
 
భువనేశ్వరి, తనతోపాటు అక్క రేవతి మంగళవారం ఆరు నెలల శిశువును ఉయ్యాలలో నిద్రపుచ్చి, వారు కూడా ఇంట్లోనే నిద్రిస్తున్నారు. కొద్దిసేపటికి భువనేశ్వరికి మెలుకువ వచ్చి చూడగా ఉయ్యాలలో బిడ్డ కనిపించలేదు. చుట్టు ప్రక్కల వెతికి చూశారు, కానీ బిడ్డ దొరకలేదు. ఇంతలో చుట్టుప్రక్కల వాళ్లు బంధువులు అందరూ కలిసి వెతకగా చివరికి నీళ్ల డ్రమ్‌లో చనిపోయి ఉన్నాడు. 
 
ఈ విషయం తెలుసుకుని వినోద్‌కుమార్ అక్కడికి వచ్చాడు. బోరున విలపించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  ప్రారంభించారు. త్వరలోనే దోషులను పట్టుకుంటామని చెప్పారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.