శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 3 మార్చి 2021 (16:50 IST)

తిరుపతిలో బాలుడి కిడ్నాప్, ఆచూకీ చెప్పినవారికి పారితోషికం

తిరుపతిలో ఆరేళ్ళ బాలుడు శివకుమార్ సాహును కిడ్నాప్ చేశారు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద కనిపించకుండా పోయాడు చత్తీస్‌ఘడ్‌కు చెందిన బాలుడు. 
 
బాలుడి కిడ్నాప్‌కు సంబంధించిన సి.సి. టీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు. గత నెల ఫిబ్రవరి 27వ తేదీన శివకుమార్ సాహు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్సనార్థం వచ్చాడు. తిరుమలకు వెళ్ళేందుకు అలిపిరి వద్దనున్న బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద వేచి ఉన్నారు.
 
అయితే సాహు ఆడుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు. చిన్నారి కోసం సుమారు రెండు గంటల పాటు తల్లిదండ్రులు వెతికారు. అయితే ఎంతకూ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిసి టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు పోలీసులు.
 
గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని తీసుకెళ్ళడాన్ని పోలీసులు గమనించారు. అయితే పోలీసులు రికార్డుల్లో ఆ వ్యక్తి ఎవరన్నది తెలియలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపితే తగిన పారితోషికం ఇస్తామంటున్నారు పోలీసులు.