హిజ్రాలు చదివిస్తున్న విద్యార్థినికి వేధింపులు, అనంతలో ఆత్మహత్యా యత్నం
అనంతపురం లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని ఆత్మహత్యయత్నం చేసుకోవటం తీవ్ర కలకలం సృష్టించింది. కళాశాలలో పనిచేసే బోటనీ టీచర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా మాట్లాడటంతో సూసైడ్‌కు ప్రయత్నించిందని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని జిల్లాలోని హిజ్రాలు అందరు కలిసి దత్తతకు తీసుకున్నారు. అమ్మాయికి 30 వేల రూపాయలు చెల్లించి నగరంలోని ఓ ప్రముఖ జూనియర్ కళాశాల్లో బైపిసి చదివిస్తున్నారు. కళాశాల రూమ్‌లో నోట్‌బుక్ పోవడంతో బోటని లెక్చరర్, బాధిత విద్యార్థినిని అందరి ముందు లేపి నోట్ బుక్ తీసుకున్నవా అని అడగడమే కాకుండా దూషించింది.
మరుసటి రోజు కూడా ఆ లెక్చరర్ క్లాసులో దొంగలు వున్నారని ఈ బాధిత అమ్మాయిని చూసి చెప్పిందనీ, దీంతోనే మా అమ్మాయి సూసైడ్ ఎటెంప్ట్ చేసుకుంది అని హిజ్రాలు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో తామంతా కలసి చదివిస్తున్నామన్నారు. లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని అన్నారు. ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం స్పందించలేదనీ, న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని హిజ్రాలు హెచ్చరించారు.