కన్నతల్లిపై ప్రేమతో... అమరావతి నిర్మాణానికి ఓ మహిళ రూ.కోటి విరాళం
తన తల్లి చెప్పిన మాటకోసం, కన్నతల్లిపై ప్రేమతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ మహిళ కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చారు. ఆ మహిళ పేరు విజయలక్ష్మి. గుంటూరు జిల్లా. హైదరాబాద్ నగరంలో తనకున్న స్థలాన్ని విక్రయించి ఈ విరాళం అందజేశారు. రూ.కోటి చెక్కును సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారభమైన విషయం తెల్సిందే. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని నిధులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తూ ముందుకు కదులుతోంది. మరోవైపు ప్రజా రాజధాని నిర్మాణం కోసం విరాళాలు కూడా స్వీకరిస్తుంది.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన పి.విజయలక్ష్మి అనే మహిళ ఏకంగా ఒక కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఆమె చెక్కును అందించారు. తన మాతృమూర్తి కోగంటి ఇందిరాదేవి కోరిక నెరవేర్చేందుకు అమరావతి నిర్మాణానికి ఈ భారీ విరాళం ఇచ్చినట్టు విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్ నగరంలో తమకు ఉన్న కొద్ది స్థలాన్ని విక్రయించి ఈ డబ్బును విరాళంగా ఇచ్చినట్టు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో తాము కూడా భాగస్వాములం కావాలనే సంకల్పించామని తెలిపారు. కాగా భారీ సాయం చేసిన విజయలక్ష్మిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. విజయలక్ష్మి సాయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రశంసించారు. గొప్పత్యాగం చేశారంటూ మెచ్చుకున్నారు.