సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 9 మే 2018 (21:45 IST)

నాకు సినిమాల్లో అవ‌కాశాలు లేవ‌ని ఎవ‌రు చెప్పారు... శివ‌మెత్తిన శివాజీ..!

సినీ నటుడు శివాజీ గ‌త కొంతకాలంగా రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాడు. ఈరోజు శివాజీ మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నాయ‌కులపై ఫైర్ అయ్యారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే... ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యో

సినీ నటుడు శివాజీ గ‌త కొంతకాలంగా రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాడు. ఈరోజు శివాజీ మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నాయ‌కులపై ఫైర్ అయ్యారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే... ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తూ భారత ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్పందించిన  శివాజీ.. అశోక్‌ బాబుపై బీజేపీ నేతల తీరు బాగోలేదని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఈ రోజు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు 13 జిల్లాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడలో వారి ఆందోళనకు మద్దతు తెలిపిన శివాజీ మీడియాతో మాట్లాడుతూ... "అశోక్‌ బాబుపై చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన సమైక్యాంధ్ర కోసం కూడా పోరాడారు. అశోక్‌ బాబు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా తన బాధ్యత తాను నిర్వర్తిస్తున్నారు. అశోక్‌ బాబునే కాదు.. మమ్మల్ని కూడా అలాగే విమర్శిస్తున్నారు. 
 
సినిమాల్లో అవకాశాలు దొరకట్లేదు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఇలా విమర్శలు చేస్తున్నామని మమ్మల్ని అంటున్నారు. మాకు సినిమాల్లో అవకాశాలు లేవని అసలు ఎవరు చెప్పారు మీకు? అశోక్ బాబు వెనుక ప్రజా సంఘాలు ఉన్నాయి.. అందరూ ఉంటారు.. ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన వెనుక అందరమూ ఉంటాం. ఆయనను ఏకాకిని చేసి ఆయనపై దాడి చేస్తామంటే మేము ఊరుకోం. అలాగే  రేపు హోదా కోసం జాగారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 
 
విజయవాడలో నిర్వహించనున్న ఈ నిరసన కార్యక్రమం రేపు సాయంత్రం 7 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను ఆహ్వానిస్తాం అని అన్నారు. ప్ర‌త్యేక హోదా కోసం ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తుల్లో నిర‌స‌న తెలియ‌చేస్తున్నారు. మ‌రి..కేంద్రం ఎప్ప‌టికి స్పందిస్తుందో..?