1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 16 జూన్ 2016 (17:41 IST)

నాకు నచ్చని అధికారులను బదిలీ చేస్తారనే సైకిలెక్కా.. ఇపుడు కాదంటారా?: విలపిస్తున్న జంపింగ్ ఎమ్మెల్యే ఎవరు!

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు తమకు తోచిన విధంగా లెక్కలు వేసుకుని పసుపు కండువా కప్పుకున్నారు.

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు తమకు తోచిన విధంగా లెక్కలు వేసుకుని పసుపు కండువా కప్పుకున్నారు. తీరా రోజులు గడిచే కొద్దీ వారికి పగటి పూటే చూక్కలు కనిపిస్తున్నాయి. పార్టీ మారడానికి తాము విధించిన షరతులు, ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయడం లేదు కదా.. కింది స్థాయి నేతల నుంచి చీత్కారాలు, అవమానాలు ఎదురవుతున్నాయి. దీంతో వారు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వారిలో ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒకరు. 
 
ఈయన టీడీపీలో చేరిన మరుక్షణమే స్థానికంగా ఉండే సీఐను బదిలీ చేయించారు. కానీ, ఆ సీఐ తన రాజకీయ పరపతితో అదే స్టేషన్‌కు సాయంత్రానికి విధుల్లో చేరారు. దీంతో గొట్టిపాటి రవికుమార్ షాక్ తినాల్సి వచ్చింది. అంతేనా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కరణం బలరాంపై కారాలుమిరియాలు నూరుతున్నారు. 
 
ఇలా అయితే, తాను మనుగడ సాగించలేనని భావించిన అద్దంకి ఎమ్మెల్యే ఆగమేఘాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సమావేశమై తన గోడును వెళ్లబోసుకున్నాడు. తాను పార్టీలో చేరే ముందు తనకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చడం లేదని, ఇలా అయితే తనకు కష్టమవుతుందని తేల్చి చెప్పారట. ఈ సందర్భంగా అద్దంకి సీఐ బదిలీ వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించారట. 
 
తాను సిఐను బదిలీ చేయిస్తే... సాయంత్రానికి ఆ ఉత్తర్వులను మార్పించి కరణం బలరాం తనను అవమానించారని ఇలా అయితే నియోజకవర్గంలో తన మాట ఎవరు వింటారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారట. తాను పార్టీలో చేరేటప్పుడే తాను సూచించిన అధికారులను బదిలీ చేయాలని అడిగానని, అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు మాట తప్పుతున్నారని, తనకు న్యాయం చేయాలని ఆయన ప్రాధేయపడ్డారట.