పర్యాటక కేంద్రంగా బ్రహ్మయ్యలింగం చెరువు : చంద్రబాబు వెల్లడి
గన్నవరం మండలం చక్కవరం గ్రామం బ్రహ్మయ్యలింగం చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నీరు చెట్టు కార్యక్రమంలో సీఎం పాల్గొనడానికి ఆయన ఈ గ్రామానికి రాగా, పార్టీ నాయకులతోనే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏలూరు కాలువలో భూములు కోల్పోతున్న రైతులు తమకు న్యాయం చేయాలని సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని యత్నించారు. వారిని, మరి కొందరు టీడీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవేమీ పట్టించుకోని సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు.
తన ప్రసంగంలో రూ.5 కోట్లతో లిప్ట్ ఇరిగేషన్ ద్వారా బ్రహ్మయ్య లింగం చెరువుకు నీరు తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఈ చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని తెలిపారు. మరోవైపు.. రైతులతో వినతి పత్రం ఇప్పించేందుకు ప్లాన్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు పక్కనే అసహనంగా కూర్చుండిపోయారు.