నవ్యాంధ్రలో అత్యాచారాల పర్వం... 8 యేళ్ల బాలిక.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై రేప్
నవ్యాంధ్రలో అత్యాచారాలపర్వం కొనసాగింది. ఆదివారం ఒక్కరోజే మూడు అత్యాచారాలు జరిగాయి. ఎనిమిదేళ్ళ బాలిక మొదలు ఓ ఇంజనీరింగ్ చదివే విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థినిపై నలుగురు అకతాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ గోదావరి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే, కడపలో 11ఏళ్ల బాలికపై, చిత్తూరు జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై సమీప బంధువులే అత్యాచారానికి ప్రయత్నించారు. కర్నూలు జిల్లాలో ఒంటరిగా ఉన్న మహిళపై గ్రామ వలంటీర్ అత్యాచారయత్నం చేయగా.. శ్రీకాకుళంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై నలుగురు ఆకతాయిలు లైంగికదాడికి ప్రయత్నించారు.
పగో జిల్లా లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎనిమిదేళ్ళ బాలికపై ఇంటర్ చదివే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం శనివారం జరిగింది. పక్కింట్లో ఉండే యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అలాగే, కడప జిల్లా రాయచోటి మండలానికి చెందిన 11 ఏళ్ల బాలికపై సమీప బంధువు గత శుక్రవారం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది.
మద్యం మత్తులో సొంత అన్న కూతురైన తొమ్మిదేళ్ల బాలికపైనే అత్యాచారయత్నానికి ప్రయత్నించాడో ప్రబుద్ధుడు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మునిరాజు (29) ఆదివారం సాయంత్రం అన్న కూతురుని గడ్డి తీసుకొద్దామని తోటవద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు.
ఇకపోతే, విధి నిర్వహణ పేరిట ఓ ఇంటికి వెళ్లిన గ్రామ వలంటీర్.. ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని ఓ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై నలుగురు యువకులు లైంగిక దాడికి ప్రయత్నించారు. స్థానికంగా ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటోంది. ఆదివారం రాత్రి టిఫిన్ కోసం బయటకు రాగా నలుగురు ఆకతాయిలు ఆమెను అడ్డుకుని బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.