శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (18:57 IST)

నైపుణ్యాభివృద్ధిలో నవ్యాంధ్రకు బంగారు పతకం

యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించి యువతను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం కలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చేస్తున్న కృషి సత్పలితాలనిస్తున్నది. దేశంలోనే అత్యుత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. నైపుణ్య శిక్షణ ద్వారా యువతలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలో ఉత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రాలకు అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సంస్థ ప్రతిఏటా అవార్డులను అందజేస్తుంది. 
 
ఈ ఏడాది ఉత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల కేటగిరిలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో అసోచామ్ సంస్థ నిర్వహించిన ‘స్కిల్ ఇండియా సమిట్ అండ్ అవార్డ్స్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) తరుపున డాక్టర్ రవికుమార్ గుజ్జుల (సీజీఎం టెక్నికల్), ధేనుకా నాయక్ (సీనియర్ మేనేజర్) అవార్డును కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతులమీదుగా అందుకున్నారు. ఇక పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ విభాగంలో భారీస్థాయిలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నందుకుగాను విశాఖపట్నంలోని హెచ్.పి.సిఎల్ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఎపిఎస్‌ఎస్‌డిసి అమలు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో ఒక మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం, గిరిజన ప్రాంతాల్లోని యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి, ప్రాథమిక రంగంలో శిక్షణ, నైపుణ్య శిక్షణ పొందిన యువతకు జాబ్ మేళాలల ద్వారా ఉద్యోగాలు కల్పించడం లాంటి అంశాలు అసోచామ్ సభ్యులను ఆకర్షించాయి.
 
ప్రధానోత్సవం కార్యక్రమం ముగిసిన అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి సీజీఎం డాక్టర్ రవికుమార్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి)కు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించిందని, నైపుణ్య శిక్షణలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా అంధ్రప్రదేశ్ నిలిచి ఈ ఏడాది  “బెస్ట్ స్కిల్లింగ్ స్టేట్” విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచి బంగారు పథకం దక్కించుకుందని తన హర్షాన్ని వ్యక్తం చేశారు. 
 
ఎపిఎస్‌ఎస్‌డిసి రాష్ట్రం నలుమూలలా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల వివరాలను విలేకరులకు వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల స్థాయి నుంచి ఐటిఐ, పాలిటెక్నికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో అనేక రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోందని, అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 
 
నైపుణ్య శిక్షణలో ఉత్తమ రాష్ట్రంగా 2016-17, 2017-18 లో అసోచామ్ అవార్డులను ఎపిఎస్‌ఎస్‌డిసి అందుకుందని  చెప్పారు.యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, యువత ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుని నైపుణ్యాలను పెంచుకునేందుకు అనేక శిక్షణా కార్యక్రమాలను ఎపిఎస్‌ఎస్‌డిసి అమలు చేయడంలో దేశంలోనే ప్రధమంగా ఉందని తెలిపారు.
 
డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ పాఠ్యాంశాలతోపాటు ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ సెంటర్లలో విద్యార్థుల్లో ఉద్యోగ అర్హత నైపుణ్యాలు పెంచేలా శిక్షణ (అమెజాన్ వెబ్ సర్వీసెస్, పైథాన్ మరియు డిజిటల్ మార్కెటింగ్ మొదలగునవి). డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తయిన వెంటనే విద్యార్థులు ఉద్యోగాలు పొందడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు, ఇంజనీరింగ్ కాలేజీల్లో రెగ్యులర్ సిలబస్‌తోపాటు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు (సీమెన్స్, నానో డిగ్రీ, గూగుల్ కోడ్ ల్యాబ్స్ మరియు డసాల్ట్ ల్యాబ్స్) అమలు చేస్తోందని, గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు స్వయం ఉపాధి కల్పన, ఉత్పత్తి మరియు మార్కెటింగ్ సెంటర్ల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడంతోపాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ప్రణాళికను కూడా ఎపిఎస్‌ఎస్‌డిసి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.