మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 జులై 2024 (09:14 IST)

పూరిగుడిసెలో కూర్చొని పెన్షన్ డబ్బులు పంపణీ చేసిన సీఎం చంద్రబాబు (Video)

pension distribution
పేదరికం లేని సమాజమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జూలై ఒకటో తేదీన ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్లను ఆయన స్వయంగా ఓ లబ్ధిదారు కుటుంబ సభ్యులకు అందజేశారు. పెనుమాకలో పాముల నాయక్ కుటుంబానికి ఆయన పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు. పాముల నాయక్‌కు వృద్ధాప్య పెన్షన్, నాయక్ కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు. ఆ సమయంలో తమకు ఇల్లు కావాలని వారు కోరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణం ఇంటిని మంజూరు చేశారు. అలాగే, ఇంటి మంజూరు పత్రాన్ని కూడా వారికి అందజేశారు. 
 
మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్‌లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. 
 
'మీ అందరి ఆశీస్సులతో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడింది. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ చెప్పారు. ఆయన స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. పేదలపై శ్రద్ధ పెడతాం.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే నా ఆలోచన. దివ్యాంగులకు పింఛను రూ.6 వేలు చేశాం. వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉంది.
 
గత పాలకులు, అధికారులు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పింపిణీ తమ వల్ల కాదన్నారు. పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని వారికి ఆనాడే చెప్పా. నేడు 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పంపిణీ జరుగుతోంది. దీనికి వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవాలని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు ఐదు సంతకాలు పెట్టా. మొదటిది మెగా డీఎస్సీ.. వీలైనంత త్వరగా టీచర్ల నియామకం చేపట్టే బాధ్యత తీసుకుంటా. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం చేశా. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడోది పెట్టా. రూ.5 కే భోజనం చేయొచ్చు. త్వరలోనే 183 క్యాంటీన్లను ప్రారంభిస్తాం. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తాం. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. మాది ప్రజా ప్రభుత్వం.. నిరంతరం మీకోసం పనిచేస్తాం. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 
 
తవ్వుతున్న కొద్దీ గత ప్రభుత్వ తప్పులు, అప్పులే కనబడుతున్నాయి. గతంలో ప్రజల బతుకులను రివర్స్‌ చేశారు.. కోలుకుని మళ్లీ ముందుకు వెళ్లాలి. అందరం సమష్టిగా కలిసి పనిచేద్దాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం.. పెంచిన దాన్ని పంచుతాం. మీ అందరి అభిమానం చూరగొని లోకేశ్‌ ఇక్కడి నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీతో ఆయన్ను గెలిపించారు. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకుంటాం. వైకాపా నేతలు ఐదేళ్ల పాటు ప్రజలను అణగదొక్కారు. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి కల్పించారు అని చంద్రబాబు ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను మంత్రి నారా లోకేశ్‌ ప్రస్తావించారు. వాటిని పరిష్కరించాలని మంత్రి లోకేశ్‌ సీఎంను కోరారు. అమరావతి నిర్మాణ పనులకు మంగళగిరి ప్రజలు అండగా ఉంటారని చెప్పారు.