సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

చంద్రబాబుతో పాటు.. మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి సోమవారం ఉద‌యం వెళ్లిన సీఐడీ అధికారులు అమ‌రావ‌తి రాజధానిలో అసైన్డ్‌ భూముల విషయంలో విచారణకు సంబంధించి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు.
 
అంతేగాక‌, ఆయ‌న‌తో పాటు ఏపీ మాజీ మంత్రి పి.నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం నారాయణ హైదరాబాద్‌లో లేరు. ఆయ‌న‌ ఈ నెల 23న విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నోటీసుల‌పై ఇప్పటిర‌కు చంద్రబాబు, నారాయ‌ణ స్పందించ‌లేదు.
 
కాగా, గత ప్ర‌భుత్వంలో నారాయణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్ర‌బాబు, నారాయ‌ణ‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 
 
కాగా, అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్‌ భూముల క్ర‌య‌, విక్ర‌యాల‌కు సంబంధించి గత నెల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్‌ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
 
దీంతో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ డీఎస్పీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే ఈ రోజు చంద్రబాబు, నారాయణకు నోటీసులు ఇచ్చామని సీఐడీ అధికారులు చెబుతున్నారు.
 
ఈ అసైన్డ్ భూములపై ఇప్పటికే వివాదం నెలకొనివున్న విషయం తెల్సిందే. ఏపీసీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి లేకుండాచేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం అక్కడ జరిగిన అక్రమాలను వెలికితీస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.