ఏపీలో నేటి నుంచి వడగాల్పులు.. భగభగలే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి వడగాలులు వీయనున్నాయి. దీనికితోడు సూర్యతాపం కారణంగా రాష్ట్రం పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి. ఈ పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందన విశాఖపట్టణం వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో 'మోకా' సూపర్ సైక్లోన్ ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు పెరిగాయి. శనివారం పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు వరకు నమోదయ్యాయి. అయితే రానున్న నాలుగైదు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత పెరుగుతాయని, అనేకచోట్ల వడగాలులతో పాటు, చాలా ప్రాంతాల్లో 40 నుంచి 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఆదివారం వివిధ జిల్లాల్లో 176 మండలాల్లో మోస్తరు వేడిగాలి, 136 మండలాల్లో తీవ్రంగా వడగాలులు వీచే అవకాశం ఉందని, 15వ తేదీ సోమవారం 132 మండలాల్లో వేడిగాలి, 153 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో మొత్తం 670 మండలాలు ఉండగా... 309 మండలాల్లో గాడ్పుల ప్రభావం ఉంటుంది. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కోనసీమ జిల్లాల్లో తీవ్ర గాడ్పులు వీయను న్నాయి. ఎండ, వడదెబ్బబారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ సూచించారు.