చండీ - రుద్ర - రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్
ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారాన్ని దక్కించుకుని, మరో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు వీలుగా చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలంతా కళ్యాణ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ఈ యాగాలను నిర్వహిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించినప్పటికీ... ఆయన మాత్రం శాశ్వతంగా తానే అధికారంలో ఉండాలన్న కాంక్షతో ఈ యాగాలను నిర్వహిస్తున్నారు.
స్థానిక విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యాగంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు మంగళ వాయిద్యాలు, వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విష్వక్సేనల పూజలు, పుణ్యహవచనం తదితర పవిత్ర పూజలతో ఈ యజ్ఞం మొదలైంది. జగన్ యాగం సంకల్పం తీసుకున్న తర్వాత మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అంఖడ దీపారాధనలో పాల్గొన్నారు.
ఈ నెల 17వ తేదీ వరకు ఆరు రోజుల పాటు మహాయజ్ఞం కొనసాగుతుంది. నాలుగు ప్రధాన యాగశాలల్లో ఒక్కో యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలలో యాగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులు వీక్షించేందుకు వీలుగా యాగశాలల చుట్టూ నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక క్యూలైన్‌ను వీఐపీలకు కేటాయించారు. చివరి రోజున విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతి యజ్ఞం ముగుస్తుంది.