1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ప్రజల మధ్యన ఎమ్మెల్యేలు.. పరదాల మాటున ముఖ్యమంత్రి : 'ఆర్ఆర్ఆర్' వ్యంగ్యాస్త్రాలు

raghuramakrishnamraju
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలు మాత్రం గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ప్రజల మధ్య ఉండాలని, ముఖ్యమంత్రి జగన్ మాత్రం పరదాల మాటున వచ్చి వెళుతుంటారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తథ్యమని అందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, తన ముఖం చూసే ప్రజలు ఓటేశారని, తన ఫొటో పెట్టుకునే ఎమ్మెల్యేలు గెలిచారని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌.. ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాల ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుంటే పులివెందులలోనే తెదేపా అభ్యర్థి రామగోపాల్‌రెడ్డి అత్యధికంగా ఓట్లు వచ్చాయన్నారు. 
 
పులివెందులలో తమ పార్టీ పరిస్థితిపై తక్షణం సమీక్షించాల్సి ఉందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పులివెందులలో పోటీ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాలు విసరడం విడ్డూరంగా ఉందన్నారు. పులివెందులలో అధికార పార్టీని ఓడించడానికి బీటెక్‌ రవి సరిపోతారనే ధీమాలో ప్రతిపక్షం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. 
 
రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్‌ప్లాన్‌కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల్లో 1,130 ఎకరాలను జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి కేటాయించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలన్నీ తమ ప్రభుత్వ హత్యలేనని నిందించారు. విశాఖలో వేల ఎకరాలను కబ్జా చేశారని, ఆ భూములను పేదలకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సూచించారు.