వారాహి వాహనంపై వైకాపా విమర్శలు.. పసుపు రంగు వేసుకోవాలంటూ ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేపట్టనున్న బస్సు యాత్ర కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనంపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వారాహికి తెలుగు, నలుపు, మరో రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిగ్గా సరిపోతుందని వైకాపా మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.
అలీవ్ రంగు కేవలం సైనిక వాహనాలకు మాత్రమే వాడతారని, వారాహికి ఆ రంగు వేయడం చట్ట విరుద్ధమని గుర్తుచేశారు. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్‌కు మోటార్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివే సమయం లభించలేదా? అని ప్రశ్నించారు.
డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాన్లను కొనుక్కుని యుద్ధం చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. ఇలాంటివి సినిమాల్లో నడుస్తాయని, నిజ జీవితంలో కుదరవని అన్నారు. ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగానే ట్విట్టర్ వేదికగా స్పందించారు.