ప్రత్యేక హోదా ఇస్తామంటే ఎవరితోనైనా పొత్తుకు సిద్ధం : పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ వైకాపా పాలకులకు భవిష్యత్ కనిపిస్తున్నట్టుగా ఉంది. ఆ పార్టీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీంతో ఆ పార్టీ నేతలకు ఇప్పటి నుంచే ఓటమి భయం పట్టుకున్నట్టు తెలుస్తుంది. అందుకే పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామంటే ఏ పార్టీతో అయినా జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నాని తెలిపారు.
వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. అదేసమయంలో జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చల్లో ఏపీలో వైకాపాతో కలిసి పోటీ చేయాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేలా ప్రశాంత్ కిషోర్ వైకాపాకి దిశా నిర్ధేశం చేస్తారా లేదా అనేది ఊహాజనిత ప్రశ్న అని చెప్పారు. పీకే ఆలోచనలు, తెలివితేటలను మాత్రమే ఎన్నికల్లో వాడుకుంటామన్నారు. వైకాపాను ఎవరూ శాసించలేరని పేర్ని నాని తేల్చి చెప్పారు. తనకు మంత్రిపదవి కంటే సీఎం జగన్ ఇస్తున్న గౌవరమే ఎక్కువ అని చెప్పారు.