నేడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఈ భేటీ సాయంత్రం 6.30 గంటలకు జరుగనుంది.
నిజానికి వీరిద్దరూ గతంలో పలు కార్యక్రమాల్లో కలుసుకున్నారు. కానీ, ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంపై రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది.
ఇటీవలి కాలంలో హైకోర్టులో ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా, పలువురు ప్రభుత్వ అధికారులు కోర్టు ధిక్కరణ కేసుల్లో చిక్కుకుని జైలుశిక్షలు పడే స్థాయికి వ్యవహరిస్తున్నారు. అలాగే, ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలను కూడా హైకోర్టు కొట్టివేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.