ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (16:54 IST)

తాడేపల్లికి చేరిన మాజీ మంత్రి బాలినేని పంచాయితీ!

balineni srinivasa reddy
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి పంచాయతీ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. బాలినేని అలకబూనటంతో ఆయన్ను బుజ్జగించే పనిలో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇందుకోసం మాజీ మంత్రి బాలినేని సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించారు. 
 
ప్రస్తుతం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో బాలినేని భేటీ అయ్యారు. తన అసంతృప్తికి గల కారణాలపై సీఎం జగన్‌కు బాలినేని వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, పార్టీలో తన ప్రాధాన్యత తగ్గించే విధంగా ఎవరు పనిచేస్తున్నారనే అంశంపైనా సీఎం జగన్‌కు పలు ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. 
 
కాగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యత లేదంటూ బాలినేని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైకాపా ప్రాంతీయ కో-ఆర్డినేటర్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పిలిచినా బాలినేని స్పందించలేదు. 
 
గత మూడు రోజులుగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ వచ్చారు. పార్టీ పదవికి కూడా బాలినేని రాజీనామా చేయనున్నట్లు అనుచరుల నుంచి వార్తలు రావడంతో ఆయన్ను సీఎం జగన్‌ తాడేపల్లికి పిలిపించారు. వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారని బాలినేనిపై పలువురు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు సీఎంకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. బాలినేని శ్రీనివాస్‌ వారిని పట్టించుకోవడం లేదని.. వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని పలువురు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. 
 
వీటన్నింటిపైనా బాలినేనిని జగన్‌ వివరణ అడిగినట్లు తెలుస్తోంది. ఆది నుంచి పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన ముఖ్యనేత అయిన బాలినేని ఇలా పార్టీ పదవుల నుంచి తప్పుకోవడంపై వైకాపా అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బాలినేనిని బుజ్జగించి తిరిగి నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల సమన్వయకర్తగా మళ్లీ బాధ్యతలు తీసుకునేలా సీఎం జగన్‌ బుజ్జగిస్తున్నట్లు సమచారం.