జగన్ కోసం 800 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం ఒక అభిమాని ఏకంగా 800 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లికి వచ్చారు. జగన్‌పై విపరీతమైన అభిమానం పెంచుకున్న మహారాష్ట్ర రైతు షోలాపూర్ జిల్లా నుంచి సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లికి చేరుకున్నాడు. ఆయనను సీఎం జగన్ ఆప్యాయంగా స్వాగతించి ఫోటోలు దిగారు. ఆ రైతు పేరు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా వాసి. సీఎం జగన్ అంటే అమితమైన అభిమానం. ఆయన విధానాలు లక్ష్మణ్ కాక్డేకు ఎంతగానో నచ్చాయి. దాంతో సీఎం జగన్‌ను ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఈ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఇందుకోసం ఈ నెల 17వ తేదీన మహారాష్ట్రలలోని తన స్వగ్రామం నుంచి బయలుదేరి ఆయన.. 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లికి చేరుకున్నాడు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. కాక్డే గురించి విషయం తెలుసుకున్న సీఎం జగన్... ఆ రైతును ఆప్యాయంగా ఆహ్వానించాడు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు కాక్డే జగన్ బొమ్మ ఉన్న టీషర్టును ధరించివచ్చారు. దానిపై కాబోయే ప్రధాని జగన్ అని రాసివుంది.