నేడు తెలంగాణ పర్యటనకు వస్తున్న హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఒక రోజు పర్యటన నిమిత్తం తెలంగాణాకు వస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయానికి సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో చేవెళ్లకు వెళ్లి బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సాయంత్రం 3.30 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకునే ఆయన.. సాయంత్రం 3.50 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు "ఆర్ఆర్ఆర్" సినిమా ఆస్కార్ విజేతలతో ఆయన తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడ నుంచి 5.15 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గంలో చేవెళ్లకు చేరుకుంటారు. ఆరు గంటలకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన చేవెళ్లకు చేరుకుని పార్లమెంటరీ ప్రవాస్ యోజన సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా సభ ఏర్పాటుచేయడంతో పాటు పార్టీలో కీలక నేతల చేరికలపై రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తారు.
తెలంగాణ రాష్ట్ అసెంబ్లీకి ఈ యేడాది ఆఖరులో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి సంకల్పంతో ఉంది. ఇందులోభాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు తెలంగాణాపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులోభాగంగా, ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు అమిత్ షా వస్తున్నారు. ఇకపై వీరిద్దరూ ప్రతి నెలా పర్యటిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా కార్యక్రమాన్ని నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.