బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

నేడు భోగాపురం విమానాశ్రయానికి సీఎం శంకుస్థాపన

jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సీఎం జగన్ పలు శంకుస్థాపనలు చేయనున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. విశాఖ గవర్నర్‌ బంగ్లాలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 'వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఈ ప్రాంత అభివృద్ధి కీలకం కాబోతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం. అన్ని అనుమతులూ రావడంతో పనులు చకచకా సాగనున్నాయి. మరో నాలుగున్నరేళ్ల తర్వాత శ్రీకాకుళం ముఖచిత్రం మారిపోతుంది.
 
అలాగే, రూ.3,500 కోట్లతో విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నాం. 2025 సెప్టెంబరు నాటికి ఇది పూర్తి అవుతుంది. విశాఖ నుంచి భోగాపురం దాకా రూ.6,500 కోట్లతో చేపట్టనున్న ఆరు లైన్ల జాతీయ రహదారికి కేంద్రం అనుమతులు మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టులో రాష్ట్రం తన వాటాగా రూ.1,200 కోట్లు వెచ్చిస్తుంది. ఈ రహదారి పూర్తయితే విశాఖపట్నం, విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయి. విశాఖ ఐటీ సెజ్‌లో అదానీ డేటా సెంటర్‌, ఐటీ పార్క్‌, రిక్రియేషన్‌ సెంటర్‌, స్కిల్‌ వర్సిటీలకూ బుధవారం సీఎం శంకుస్థాపన చేస్తారు. 
 
చంద్రబాబు సీఎంగా ఉండగా 2019 ఫిబ్రవరిలో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో రన్‌వేకు సంబంధించి 40 ఎకరాల భూముల అంశం కోర్టు పరిధిలో ఉంది. మేం అధికారంలోకి వచ్చాక కోర్టు కేసులు పరిష్కారమై... అనుమతులు రావడంతో ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన చేస్తున్నాం. చంద్రబాబు ఇకనైనా అసత్యాలు మానుకోవాలి. రామాయపట్నం పోర్టూ వైకాపా అధికారంలోకి వచ్చాకే కార్యరూపం దాల్చింది అని మంత్రి అమర్నాథ్ వివరించారు. 
 
ఇదిలావుంటే, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం జగన్‌ పర్యటన మరోసారి వాయిదా పడింది. గత నెల 14న కొవ్వూరులో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. సీఎం పర్యటన, రోడ్‌ షో, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. వర్షాల వల్ల వాయిదా వేసినట్లు హోంమంత్రి తానేటి వనిత మంగళవారం తెలిపారు. సీఎం పర్యటన ఈ నెల 24న ఉంటుందని మంత్రి చెప్పారు.