శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (11:34 IST)

మరో బాదుడుకి జగన్ సర్కారు సిద్ధం... ఆస్తి పన్నుతో పాటు పార్కింగ్ చార్జీలు...

jagan
మరో బాదుడుకి ఏపీలోని సీఎం జగన్ సర్కారు సిద్ధమైంది. ఆస్తి పన్నుపై మరింత భారం మోపాలని నిర్ణయించింది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చార్జీలు కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక సంఘం సిఫారసు చేయడంతో ఇకపై ఎక్కడికక్కడ పార్కింగ్ ప్రాంతాలను జీవీఎంసీ ఎంపిక చేసి వాహన చోదకుల నుంచి పార్కింగ్ చార్జీలు వసూలు చేయనుంది. 
 
నిజానికి రాష్ట్రంలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరవాసులపై భారాలు మోపుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు విశాఖలో ఆస్తి పన్ను చెల్లించేవారిపై 5 శాతం అంటే రూ.20 కోట్ల మేర అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధమైంది. దీన్ని నగరంలోని నివాసిత సంక్షేమ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 
 
ఆస్తి పన్ను రూపంలో సమకూరిన నిధుల్లో కనీసం 20 శాతం కూడా నగరంలో అభివృద్ధికి వెచ్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించుకోవడం దారుణమని మండిపడుతున్నారు. మరో వైపు బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడానికి ఆర్థిక సంఘం సిఫారసు చేయడంతో.. ఇకపై ఎక్కడికక్కడ పార్కింగ్ ప్రాంతాలను జీవీఎంసీ ఎంపిక చేసి వాహన చోదకుల నుంచి ఛార్జీలు వసూలు చేయనుంది.
 
జీవీఎంసీ పరిధిలో 5,53,432 అసెస్మెంట్లు ఉండగా, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను దాదాపు రూ.430 కోట్లు వస్తుందని అధికారులు లెక్క కట్టారు. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రతి అసెస్మెంట్లపైనా మరో 5శాతం పన్ను పెంచితే రూ.20 కోట్లు పెరిగి ఆదాయం రూ.450 కోట్లకు చేరుతుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ.480 కోట్లకు చేరుతుంది. 
 
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వార్షిక అద్దె విలువ ఆధారిత ఆస్తి పన్ను నుంచి మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. మార్కెట్‌లో భూమి విలువ, భవనం విలువలో 0.13 శాతాన్ని ఆస్తి పన్నుగా నిర్ణయించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో భారమంతా ఒకేసారి పడకుండా ఏటా 15 శాతం పెంచుకునేలా ప్రతిపాదించారు.
 
కొత్త ఆస్తి పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నగరంలో ఇళ్ల యజమానులు అద్దెలను పెంచేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో 15 నుంచి 25 శాతం మేర అద్దెలు పెరిగినట్లు నివాసిత సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలపై భారీగా భారం పడుతోంది. మరో పక్క చెత్త ఛార్జీల పేరుతో ఏటా మురికివాడల నివాసితుల నుంచి రూ.720, మిగతా ప్రాంతాల్లో రూ.1,440 వసూలు చేస్తుండడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా మరిన్ని భారాలు వేయడానికి సిద్ధం కావడంపై నగరవాసులు మండిపడుతున్నారు.