శ్రీశైలం డ్యామ్ వద్ద ఆంధ్రా - తెలంగాణ పోలీసుల మొహరింపు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వివాదం ఆంధ్ర, తెలంగాణాల మధ్య ఉద్రిక్తలకు దారితీస్తుంది. శ్రీశైలం డ్యామ్ ఎడమగట్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని సాగిస్తుండగా... ఏపీ ప్రభుత్వం విద్యుత్తును ఉత్పత్తి చేయడం లేదు.
తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ప్రతి రోజు 4 టీఎంసీల నీరు దిగువకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. దీంతో, ఎడమగట్టు వద్ద తెలంగాణ పోలీసులు, కుడిగట్టు వద్ద ఆంధ్ర పోలీసులు మోహరించారు.
లెక్క ప్రకారం శ్రీశైలం డ్యామ్‌లో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటిని తరలించే అవకాశం ఉంటుంది. నీటిని తరలించకుంటే రాయలసీమ ఎడారి అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే ప్రతి రోజు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుకుంటుండటంతో నీటిమట్టం ఆ స్థాయికి చేరడం లేదని ఏపీ ప్రభుత్వం విమర్శిస్తోంది. ఈ జల వివాదం నేపథ్యంలో శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్డర్ వద్ద పోలీసులు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి ఉద్యోగులు మినహా ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు. అలాగే, గుంటూరులోని పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఏపీ సర్కార్ భారీగా పోలీసులను మోహరించింది. శ్రీశైలం డ్యామ్ ఎడమగట్టు గేటు వద్ద తెలంగాణ పోలీసుల పహారా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ గేట్ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు.
మరోవైపు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కృష్ణ జలాల నిర్వహణ మండలికి ఫిర్యాదు కూడా చేసింది. ఏపీ చర్యల వల్ల పర్యావరణ సమస్యలు వస్తాయంటూ తెలంగాణకి చెందిన శ్రీనివాస్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కి ఫిర్యాదు చేయడం, ట్రైబ్యునల్ ఆదేశాలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ కమిటీని నియమించడం వంటివి జరిగాయి.
ఏపీ నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయని అంటోంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్ర వద్ద అధికారులు 100 పోలీసులను మోహరించారు. గతంలో అక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.