మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (14:20 IST)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల మధ్య ముదురుతున్న జలవివాదం!

రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదం మరింతగా ముదిరిపోతోంది. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు పెంచాయి. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం కారణంగా ఇరు రాష్ట్రాలు భద్రతను పెంచాయి. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్డర్ వద్ద పోలీసులు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి ఉద్యోగులు మినహా ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు. 
 
అలాగే, గుంటూరులోని పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఏపీ సర్కార్ భారీగా పోలీసులను మోహరించింది. శ్రీశైలం డ్యామ్ ఎడమగట్టు గేటు వద్ద తెలంగాణ పోలీసుల పహారా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ గేట్ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు.  
 
మరోవైపు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కృష్ణ జలాల నిర్వహణ మండలికి ఫిర్యాదు కూడా చేసింది. ఏపీ చ‌ర్య‌ల వ‌ల్ల పర్యావరణ సమస్యలు వస్తాయంటూ తెలంగాణకి చెందిన శ్రీనివాస్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కి ఫిర్యాదు చేయ‌డం, ట్రైబ్యునల్ ఆదేశాలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ కమిటీని నియమించడం వంటివి జ‌రిగాయి. 
 
ఏపీ నిర్ణ‌యాల‌పై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే ప‌నులు జరుగుతున్నాయ‌ని అంటోంది. ఈ నేప‌థ్యంలో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. 
 
ప్ర‌ధాన విద్యుదుత్ప‌త్తి కేంద్ర వ‌ద్ద అధికారులు 100 పోలీసులను మోహ‌రించారు. గ‌తంలో అక్క‌డ చోటు చేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రోసారి అలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.