సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (21:51 IST)

రేపు ఏపీ బంద్

టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా బుధవారం ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బంద్‌కు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు.

కార్యాలయాల్లోకి చొరబడి ఇష్టమొచ్చినట్లు బీభత్సం సృష్టించారు. అంతేకాదు పలువురిపైనా దాడి చేశారు. టీడీపీ నేతలకు సంబంధించిన వాహనాలను కూడా వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. టీడీపీ నేత పట్టాభి నివాసంలోనూ అరాచకం సృష్టించారు. విలువైన సామాన్లతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 

టిడిపి కార్యాలయాలపై వైసిపి కార్యకర్తలు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం: సిపిఎం
టిడిపి కార్యాలయాలపై వైసిపి కార్యకర్తలు జరుపుతున్న దాడులను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

తక్షణమే ఈ దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడి ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ రకంగా భౌతిక దాడులకు పూనుకోవడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.

తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయ విమర్శలు హుందాగా చేయాలి తప్ప, వ్యక్తిగతం చేయడం తప్పు అని పేర్కొన్నారు.