శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జనవరి 2021 (15:38 IST)

బాబు ఇంట్లో చెక్క భజన చేసే సన్నాసి నిమ్మగడ్డ : మంత్రి కొడాలి నాని

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు నోరుపారేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో చెక్కభజన చేసుకునే సన్నాసి నిమ్మగడ్డ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీచేసింది. కానీ, కరోనా ఉన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ అన్నీ రకాల విభాగాలకు చెందిన అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. 
 
ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ నేపథ్యంలో పిల్లలకు విద్యా సంవత్సరం వృధా కాకుండా సీఎం జగన్ కృషి చేస్తుంటే.. ఇంట్లో కూర్చొని చెక్కభజన చేసుకునే మాజీ సీఎం చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తమ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే, మరో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ప్రజలు సంరక్షణ కోసమే ఎన్నికలు వద్దంటున్నామన్నారు. 
 
చంద్రబాబు ఎలా చెబితే ఎన్నికల కమిషన్ అలా పని చేస్తుందని, ప్రభుత్వ సలహాలు కూడా తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని విమర్శించారు. కోర్టు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామన్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు వాయిదా వేశారని, ఎన్నికల నిర్వహణపై ఏపీ ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు.
 
రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మంత్రి పేర్నినాని ఆరోపించారు. ఎస్‌ఈసీ దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు విశ్వాసం కోసం నిమ్మగడ్డ మూర్ఖత్వంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 
 
ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించొద్దని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాలు కూడా సుముఖంగా లేవని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.