ఎస్సీ వర్గీకరణకు పచ్చజెండా ఊపిన సుప్రీంకోర్టు... మంత్రి నారా లోకేశ్ ఏమన్నారంటే...
ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించి ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ఆయా రాష్ట్రాలకు అధికారం ఉందని పేర్కొంటూ గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు ఉపవర్గీకరణకు రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుంది.
సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ విద్యా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 30 యేళ్ల కిందటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని లోకేశ్ వెల్లడించారు.
రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు.