భర్త సహజీవనం చేస్తున్నాడా? అయితే నీవు కూడా మరొకరితో చేయొచ్చుగా...
కట్టుకున్న భర్త తనను పట్టించుకోకుండా పరాయి స్త్రీతో సహజీవనం చేస్తున్నాడనీ, అతని కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని ఓ మహిళ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. కానీ పోలీసులు మరో ఉచిత సలహా ఇచ్చారు. నీ భర్త సహజీవనం చేస్తే.. నీవు కూడా మరొకరితో సహజీవనం చేయొచ్చుకదా అంటూ ఎగతాళిగా మాట్లాడారు. పైగా, పోలీస్ స్టేషన్ ఏమైనా నీ పుట్టినిల్లా అంటూ ఎద్దేవా చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
తాజాగా వెగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లాల పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపుడు విజయవాడకు చెందిన వాసవ్య మహిళా మండలి ప్రతినిధి బొల్లినేని కీర్తి పలు విషయాలు వెల్లడించారు. ఆమె మాటలు విన్న సవాంగ్.. ఆశ్చర్యపోయారు.
'తనను పట్టించుకోకుండా పొరుగు వీధిలో ఇంకొకరితో సహజీవనం చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఒక మహిళ ఠాణాకు వెళ్లి పోలీసులను కోరింది. నువ్వు కూడా మరొకరితో సహజీవనం చేయొచ్చుగా... అని పోలీసులు ఎగతాళిగా మాట్లాడారు. మరో మహిళ... భర్తతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరించి సహాయం చేయాలని కోరగా, 'ఇదేమైనా మీ పుట్టిల్లా' అంటూ పోలీసులు ఎద్దేవా చేశారు' అని పోలీస్ బాస్‌కు బొల్లినేని కీర్తి ఇంగ్లీషులో వివరించారు.
అంతేకాకుండా, వ్యభిచారం అభియోగంపై అరెస్టు చేసి తీసుకొచ్చిన మహిళలను కొన్నిచోట్ల కొడుతున్నారని, వారిని బాధితులుగానే చూడాలని చట్టం చెబుతోన్న విషయం సిబ్బందికి తెలియచేయాలని డీజీపీని కోరారు. ఆమె చెప్పిన విషయాలను గౌతం సవాంగ్ సావధానంగా విన్నారు.
మరోసారి తెలుగులో ఆమెతోనే చెప్పించి... వాటిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్ల అధికారులకు వినిపించారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. బాధిత మహిళలకు పోలీసుస్టేషన్ అండగా నిలిచే పుట్టిల్లేనని స్పష్టం చేశారు. ఏ ఇబ్బంది వచ్చినా పోలీసుస్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ సంప్రదించవచ్చని బాధితులకు సూచించారు.