ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు తగు న్యాయం: సీపీఐ
నూతన పారిశ్రామిక విధానంలో సవరణలు చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు తగు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. గత ప్రభుత్వ విధానాల కంటే తమ ప్రభుత్వం మరింత మెరుగైన పారిశ్రామిక విధానం తీసుకొస్తుందని భావించిన పారిశ్రామికవేత్తలకు నిరాశే మిగిలిందని వ్యాఖ్యానించారు. గత పారిశ్రామిక పాలసీకన్నా నూతన ఇండస్ట్రియల్ పాలసీలో పలు కోతలు విధించారని మండిపడ్డారు.
పెట్టుబడి, విద్యుత్, వడ్డీ రాయితీలను కుదించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రివర్స్ విధానాల వల్ల పారిశ్రామిక రంగాభివృద్ధి -2.2 శాతానికి పడిపోయిందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ విధానాలకు తోడు కరోనా మహమ్మారి వల్ల పలు రంగాలకు చెందిన లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా పారిశ్రామిక విధానంలో మార్పులు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.