శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (09:05 IST)

భౌతికదూరంతో పార్లమెంట్‌ సమావేశాలు

కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారి జరుగనున్న పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

లోక్‌సభ, రాజ్యసభ ప్రధాన సభావేదికలతోపాటు గ్యాలరీల్లోనూ సభ్యులకు సీట్లు ఏర్పాటుచేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మార్చి 23న నిరవధికంగా వాయిదాపడ్డాయి. రాజ్యాంగం ప్రకారం రెండు సమావేశాలకు మధ్య విరామం 6 నెలలు మించవద్దు. అంటే సెప్టెంబర్‌ 23లోగా సమావేశాలు నిర్వహించాలి.
 
సభ ఏర్పాట్లు ఇలా
రాజ్యసభ సభ్యులను పార్టీల బలాలను బట్టి రాజ్యసభ ప్రధాన సమావేశ మందిరంతోపాటు గ్యాలరీల్లో సీట్లు కేటాయిస్తారు. సరిపోకపోతే లోక్‌సభ చాంబర్‌లో సీట్లు వేస్తారు.  
 
ప్రధాని మోదీ, మంత్రులు, సభా నాయకులు, ప్రతిపక్ష సభ్యులకు రాజ్యసభలో ప్రధాన మందిరంలో సీట్లు కేటాయిస్తారు. రాజ్యసభ, లోక్‌సభ సభా మందిరాల్లో 82 ఇంచుల వెడల్పయిన రెండు భారీ డిజిటల్‌ తెరలను ఏర్పాటుచేస్తున్నారు. నాలుగు గ్యాలరీల్లో 40 ఇంచుల తెరలను పెడుతున్నారు. 
 
వేర్వేరు చోట్ల కూర్చునే సభ్యులు చర్చలను ఈ తెరలపైనే వీక్షిస్తారు. చర్చలు కూడా ఈ తెరల ద్వారానే జరుగుతాయి. చర్చల సమయంలో ఆడియో గ్యాప్‌ రాకుండా ప్రత్యేక సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో ముఖాముఖి చర్చలు జరిపినట్టుగానే ఉంటుంది.
 
ఒక్కో సభ నాలుగు గంటలే సమావేశమవుతుంది. మొదట లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. ప్రధాన చాంబర్లనుంచి అధికారులను దూరంగా ఉంచేందుకు మధ్యలో పాలీకార్బొనేట్‌ షీట్లు ఏర్పాటుచేస్తారు. 
 
15మంది పార్లమెంటు సెక్రటేరియేట్‌ అధికారులకు మాత్రమే సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది. రాజ్యసభ సమావేశాలకు ఏడుగురు, లోక్‌సభకు 15మంది రిపోర్టర్లను మాత్రమే అనుమతిస్తారు.