శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 మే 2020 (19:26 IST)

విశాఖ గ్యాస్ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ, విశాఖ లైన్ నెం. +91-8333814019

విశాఖపట్నంలో కెమికల్ గ్యాస్ బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు.

విశాఖపట్నంతో పాటు గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో నైనా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే వైద్య సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ తో అనుసంధానం అయిన హాస్పిటల్స్ తో పాటు అనుసంధానం కాని హాస్పటల్స్ కు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు.

దీనిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అన్ని ఆస్పత్రులకు ఈ సమాచారాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు.

గ్యాస్ బాధితులు ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి నప్పుడు వారి ఆధార్ కార్డ్, ఇతర వివరాలను తీసుకొని చికిత్స అనంతరం వైద్య సేవల బిల్లులతో సహా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి పంపాల్సి ఉంటుందని అన్నారు. వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా చెల్లించాలని, దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ప్రమాదవశాత్తు లీకైన గ్యాస్ వల్ల ప్రజలు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా సత్వర వైద్య సేవలు లభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. విశాఖ నగరంలోని గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా వెంటనే సమీపంలోని గుర్తింపు పొందిన ఏ ప్రైవేటు ఆస్పత్రిలో నైనా ఎటువంటి వైద్య ఖర్చులు చెల్లించకుండానే ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందాలని ఆయన సూచించారు.

ఎటువంటి సమాచారం, సహాయం కోసమైన బాధితులు, ప్రైవేట్ ఆసుపత్రులు విశాఖ ఆరోగ్య శ్రీ హెల్ప్ లైన్ నెం. +91 - 8333814019ను సంప్రదించాలని కోరారు. జిల్లా ఆరోగ్య శ్రీ సమన్వయ కర్త డాక్టర్ డి.భాస్కర్ రావు హెల్ప్ లైన్ లో అందుబాటులో వుంటారని తెలిపారు.