బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (06:04 IST)

ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల రకాల వ్యాధులు.. జనవరి 1 నుంచి క్యాన్సర్‌ రోగులకూ చికిత్స

‘ఆరోగ్యశ్రీ’ పరిధిలోకి 2 వేల రకాల వ్యాధులను తీసుకువచ్చి పథకం ద్వారా అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే జనవరి 1 నుంచి క్యాన్సర్‌ రోగులకూ పథకంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తామని, ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని ఆయన ప్రకటించారు.

సంపాదించే వ్యక్తి అనారోగ్యం పాలైతే, శస్త్ర చికిత్స తర్వాత ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోకుండా ‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత రోగికి విశ్రాంతి సమయంలో వైద్యులు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు ఇస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఏటా 4.5 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని, ఇందుకోసం రూ.300 కోట్ల వ్యయం కానందని చెప్పారు. 

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి కొత్తగా 1060 అంబులెన్సులు కొనుగోలు చేసి 108, 104 సర్వీసుల ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు. అంతే కాకుండా అదే సమయానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలతో అన్ని ఔషధాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు కూడా గ్రేడింగ్‌ ఇస్తామని, గ్రేడ్‌–ఏ లేకుంటే అక్కడ ఆరోగ్యశ్రీని అనుమతించబోమని ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా ఏడు చోట్ల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. 

ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే ‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులకు చెక్కులు అందించిన సీఎం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోగులకు ఈ తరహా ఆర్థిక సహాయం చేయడం దేశంలోనే ఇది తొలిసారి. కుటుంబ పెద్ద జబ్బు బారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది.

‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ ద్వారా ఏటా 4.5 లక్షల మంది లబ్ధి పొందనుండగా, ఇందుకోసం రూ.300 కోట్లు వ్యయం కానుంది. శస్త్ర చికిత్స అనంతరం రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లోనే ఈ మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతుంది. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ వర్తించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం గుంటూరు వైద్య కళాశాల, జింఖానా ఆడిటోరియమ్‌ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ అక్కడ సభలో పాల్గొన్నారు. 
 
గర్వంగా ఉంది
ఎన్నికల ప్రణాళికను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ  అందులో చెప్పిన ప్రతి మాట అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నామని, మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి ఉందని, అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
 
 నా మతం ‘మానవత్వం’
ఈ మధ్య కాలంలో తన మతం, కులం గురించి మాట్లాడుతున్నారని గుర్తు చేసిన సీఎం, ఒక విషయాన్ని తేల్చి చెప్పారు.
‘నా మతం మానవత్వం. నా కులం మాట నిలబెట్టుకోవడం అని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను’ అని సీఎం స్పష్టం చేశారు.
 
‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’
మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, ఆరోగ్య రంగంలో ఒక విప్లవానికి నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు.  ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నా, పొట్ట కూటి కోసం పనులకు వెళ్లే పరిస్థితి రాకుండా ‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ ప్రవేశపెట్టామని తెలిపారు. శస్త్ర చికిత్స తర్వాత రోగి, ఆ కుటుంబం పస్తులు ఉండే పరిస్థితి రాకుండా రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు ఇస్తామని, వైద్యుల సూచన మేరకు ఎన్ని నెలలైనా సరే ఆ సహాయం చేస్తామని ప్రకటించారు. 
 
నేను విన్నాను..నేను ఉన్నాను
సంపాదించే మనిషి జబ్బున పడినా, ప్రమాదానికి గురైనా, ఆపరేషన్‌ చేయాల్సి వస్తే, ఆ తర్వాత ఆ కుటుంబం ఎంతగా ఇబ్బంది పడుతుందో తన సుదీర్ఘ పాదయాత్రలో చూశానని సీఎం వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. అందుకే ఆరోజు చెప్పానని.. ‘నేను విన్నాను–నేను ఉన్నాను’ అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నానని చెప్పారు.
 
జనవరి 1 నుంచి కొత్త కార్డులు
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి కూడా పెంచామని, ఆ మేరకు జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ కార్డులకు ‘క్యూఆర్‌’ కోడ్‌ కూడా ఇస్తామని, అందులో ఆ వ్యక్తి మెడికల్‌ రికార్డుకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని వెల్లడించారు.
 
ఆరోగ్యశ్రీ లో 2 వేల రకాల వ్యాధులు
ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, 1200 రోగాలకు పథకం విస్తరిస్తూ, జనవరి 1 నుంచి మార్పు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్న ఆయన, దీనికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 1 నుంచి 3 నెలల పాటు పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరిస్తామని, ఆరోగ్యశ్రీ పరిధిలోకి మొత్తం 2 వేల రకాల వ్యాధులను తీసుకువస్తామని వివరించారు. 
 
1060 అంబులెన్సులు
108, 104 సర్వీసులను మెరుగుపరుస్తూ 1060 అంబులెన్సులు కొనుగోలు చేస్తామన్న సీఎం, వచ్చే ఏప్రిల్‌ 1 నాటికి అవి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో అవి రోగుల వద్దకు వస్తాయని, ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందేలా ఆ సర్వీసులు పని చేస్తాయని తెలిపారు. చికిత్స తర్వాత చేసే ఆర్థిక సహాయం కూడా చెక్కుల రూపంలో ఇస్తామని చెప్పారు.

ఇంకా వైయస్సార్‌ కంటి వెలుగు తొలి దశలో దాదాపు 70 లక్షల విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్నామని, ఆ తర్వాత పథకాన్ని అన్ని వర్గాల వారికి విస్తరిస్తామని చెప్పారు. ఈ పథకంలో రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు చేస్తామని వివరించారు. 
 
ఆరోగ్యశ్రీలో పెను మార్పులు
ఆరోగ్యశ్రీలో పెను మార్పులు చేస్తూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 150కి పైగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అదే విధంగా డిసెంబరు 15 నాటికి 510 రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలతో కూడిన ఔషధాలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

ఇంకా డిసెంబరు 26 నుంచి ఆస్పత్రుల్లో పరిస్థితుల మార్పునకు శ్రీకారం చుడుతామని.. ‘నాడు–నేడు’ కార్యక్రమంలో వచ్చే మూడేళ్లలో ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నామని తెలిపారు. 
 
పింఛన్ల పెంపు
వివిధ రకాల వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్లను వచ్చే జనవరి 1 నుంచి పెంచుతున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు. డయాలసిస్‌ రోగులకు ఇప్పటికే రూ.10 వేల పింఛను ఇస్తుండగా, కొత్తగా తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛను ఇస్తామని, పక్షవాతం, ఇతర జబ్బులతో వీల్‌ చైర్, మంచానికే పరిమితమైన వారికి రూ.5 వేలు, బోదకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తుల (స్టేజ్‌ 3, 4, 5)కు రూ.5 వేలు, కుష్టు వ్యాధిగ్రస్తులను రూ.3 వేల పింఛను ఇస్తామని వివరించారు. 
 
ఆస్పత్రుల పోస్టుల భర్తీ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది మే నాటికి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంకా మూగ, చెవిటి పిల్లలకు డైకాక్లేర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేయిస్తామని చెప్పారు.
 
క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు కూడా ఆరోగ్యశ్రీ పథకంలో మెరుగైన వైద్య సేవలందిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు. ప్రతి క్యాన్సర్‌ రోగికి రేడియమ్‌ ట్రీట్‌మెంట్‌లో ఎన్ని సైకిల్స్‌ అవసరమైనా, అన్నింటి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు.
 
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అప్‌గ్రేడ్‌
రోగులకు మొక్కుబడిగా కాకుండా మెరుగైన సేవలందేలా నెట్‌వర్క్‌ ఆస్పత్రులను కూడా గ్రేడింగ్‌ చేయాలని ఆదేశించామని ముఖ్యమంత్రి చెప్పారు. వాటిని గ్రేడ్‌–ఏ, గ్రేడ్‌–ఏ ప్లస్‌గా మార్కింగ్‌ చేయాలని నిర్దేశించామని, గ్రేడ్‌–ఏ ఆస్పత్రులు ఆరు నెలల్లో తప్పనిసరిగా గ్రేడ్‌–ఏ ప్లస్‌ జాబితాలో చేరేలా వసతులు మెరుగుపర్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కనీసం గ్రేడ్‌–ఏ లేని ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపచేయబోమని తెలిపారు. 
 
నాడు–నేడు
నాడు–నేడు కార్యక్రమంలో దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న సీఎం, ఆ నిధులతో ప్రభుత్వ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రులు, బోధన ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
 
ఏడు కొత్త ఆస్పత్రులు
కొత్తగా విజయనగరం, పాడేరు, ఏలూరు, గురజాల, మచిలీపట్నం, మార్కాపురం, పులివెందులలో అన్ని సౌకర్యాలతో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటన్నింటి కోసం తన దగ్గర మంత్రదండం లేకపోయినా ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు.
 
ప్రజల అలవాట్లు మారాలి
‘వైద్యం అన్నది ఒక పర్వం. దీంతో పాటు ప్రజల అలవాట్లు మారాలి. సమాజం కూడా మారాలి. అప్పుడే వైద్యం ఖర్చు తగ్గుతుంది. అందుకే మద్యం షాపులు క్రమంగా తగ్గిస్తున్నాం. 20 శాతం మద్యం షాపులు తగ్గించాము. 43 వేల బెల్టుషాపులు మూసివేయించాము. మద్యం విక్రయాలకు సమయం నిర్దేశించాము. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. 40 శాతం బార్లు తగ్గిస్తున్నాము. ఉన్న వాటిలో కూడా ఎక్కువ ధరలు షాక్‌ కొట్టేలా ఉంటాయి’ అని ముఖ్యమంత్రి వివరించారు. వీటన్నింటితో పాటు, ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియమ్‌గా మారుస్తున్నామని చెప్పారు. 
 
గట్టిగా నిలబడతాను
చిత్తశుద్ధితో ఏది చేసినా సత్ఫలితాలు వస్తాయని, మంచి జరుగుతున్నప్పుడు సహజంగానే విమర్శలు చేస్తారన్న సీఎం వైయస్‌ జగన్,  సంబంధం లేని అంశాలను చాలా పెద్దగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు.
అయితే ఎవరు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతానని, అందరి దీవెనలు, దేవుడి ఆశీస్సులతో గట్టిగా నిలబడతానని నమ్ముతున్నానని చెప్పారు. 

ఇందు కోసం తనను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నట్లు సీఎం తన ప్రసంగం ముగించారు.
అనంతరం డాక్టర్‌ సుబ్బారావు తయారు చేసిన మహానేత వైయస్సార్‌ ప్రతిమను కార్యక్రమంలో సీఎం  వైయస్‌ జగన్‌కు బహుకరించారు.