శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జులై 2019 (12:40 IST)

ఆ కుటుంబాల వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ! మెలికపెట్టిన బుగ్గన

వైకాపా ఇచ్చిన ప్రధాన హామీల్లో ఆరోగ్యశ్రీ ఒకటి. ఈ పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక... ఈ పథకాన్ని వర్తించజేసేందుకు ప్రభుత్వం షరతులు విధిస్తోంది. 
 
ఇదే అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నెలకు రూ.40 వేలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామన్నారు. బడ్జెట్‌పై చర్చలో మాట్లాడిన మంత్రి బుగ్గన ఈ ప్రకటన చేశారు. బడ్జెట్‌లో పింఛన్లకు అధిక నిధులు కేటాయించామన్నారు. బీసీ సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం రూ.11 వేల కోట్లు కేటాయించి.. కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. 
 
తమ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.15,061 కోట్లు కేటాయించిందని బుగ్గన వెల్లడించారు. టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే.. ఇక హ్యాపీ సండే ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ పాలనలో ప్రచార ఆర్భాటం ఎక్కువ అయిందని, అందుకే ప్రజలు కూడా ‘మేటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌’ అనేవాళ్లని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. 
 
అలాగే ఈ ఏడాది నుంచి పశువులకు కూడా బీమా కేటాయిస్తున్నామన్నారు. గొర్రెలకు ఈ ఏడాదే అమలు చేస్తామన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. వైఎస్ ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి అతి ముఖ్యమైన పథకాల్లో ఆరోగ్యశ్రీ ఒకటి. జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ పథకానికి జీవం పోశారు. బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీ పథకానికి అధిక నిధులు కేటాయించారు. 
 
ఏడాదికి రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. అంటే నెలకు రూ.40 వేల లోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలందరూ ఈ పథకం కిందకు వస్తారు. గతం కంటే మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీ బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు కేటాయించారు. వైద్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రంలో మాత్రమే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని సీఎం జగన్ వెల్లడించారు.