శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 జులై 2019 (11:41 IST)

అధ్యక్షా... నేను రాజశేఖర్ రెడ్డిగారు మంచి ఫ్రెండ్స్.. అది జగన్‌కు తెలియదు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం సభలో ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీలో కృష్ణానది కరకట్టపై జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై చర్చ జరుగుతున్న వేళ, రోడ్లపై అడ్డుగా ఉన్న విగ్రహాల ప్రస్తావనను చంద్రబాబు తేగా, సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వందలాది వైఎస్ విగ్రహాలను అనుమతి లేకుండా పెట్టారని చంద్రబాబు ఆరోపించడంతో సభ దద్దరిల్లింది. చంద్రబాబు ప్రసంగాన్ని వైకాపా సభ్యులు అడ్డుకున్నారు. 
 
పైగా, చంద్రబాబు సభను తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో ఇపుడు చర్చిస్తున్న విషయాన్ని వదిలేసి, కావాలనే రెచ్చగొడుతున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. వైఎస్ విగ్రహాలను చూసి ఆయన కడుపు మండుతోందని మండిపడ్డారు. చంద్రబాబు తన నివాసాన్ని ఖాళీ చేసి, ప్రభుత్వానికి సహకరించాల్సిందేనని అన్నారు. 
 
దీనికి చంద్రబాబు వివరణ ఇచ్చారు. "అధ్యక్షా... రాజశేఖర్ రెడ్డిగారి విగ్రహం.. నాకు కడుపు మండేదేంటి. పైగా, ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్. చరిత్ర అధ్యక్షా ఇది. మీకు తెలీదా? రాజశేఖర్ రెడ్డి నాకు ఎంత మంచి ఫ్రెండ్ అంటే.. మేమిద్దరమూ మంత్రులుగా ఒక రూములో పడుకునేవాళ్లం అధ్యక్షా. అంత క్లోజ్ ఫ్రెండ్. అది జగన్ మోహన్ రెడ్డికి తెలీకపోవచ్చు. 77-83... మా ఇద్దరినీ చూసిన వారికి తెలుస్తుంది. మా మధ్య రాజకీయ విరోధం ఉందేతప్ప... వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశం పార్టీకిలోకి వచ్చాను.. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. రాజకీయంగా పోరాడాం తప్ప.. వ్యక్తిగతంగా కాదు అని అన్నారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నంత సేపు సభానాయకుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చిరు నవ్వులు చిందిస్తూ కూర్చుండిపోయారు.