శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జులై 2019 (15:38 IST)

హరికృష్ణ శవాన్ని పక్కనబెట్టి కేసీఆర్‌తో పొత్తులపై చర్చించలేదా?: బాబుపై జగన్ ఫైర్

హరికృష్ణ మృతదేహాన్ని పక్కనపెట్టుకొని కేటీఆర్‌తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడలేదా అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకెళ్లారని ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారనీ, ప్రాజెక్టు పూర్తయ్యాక సీఎం హోదాలో అక్కడికి వెళ్లానని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. 
 
అసెంబ్లీ  ప్రశ్నోత్తరాల సమయంలో జగన్‌ మాట్లాడుతూ, 'నేను వెళ్లినా.. వెళ్లకపోయినా వాళ్లు ప్రాజెక్టు పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే చంద్రబాబు ఏం చేశారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కదా.. ఆల్మట్టి ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుకుంటూ పోతే ఆయన ఏం చేశారు' అంటూ నిలదీశారు. అంత ఎత్తుకు పెంచుకుంటూ పోతే మనకు నీళ్లు ఎలా వస్తాయో కనీసం ఆలోచించారా? అని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలని సీఎం జగన్‌ అన్నారు. 
 
గోదావరి జలాల వినియోగం గురించి మాట్లాడుతూ.. 'గోదావరికి నాసిక్‌, ఇంద్రావతి, శబరి పాయలున్నాయి. కేవలం మన రాష్ట్రంలో ఉన్న గోదావరి పాయ శబరి మాత్రమే. కేవలం 500 టీఎంసీల నీరు మాత్రమే శబరి నుంచి గోదావరికి వస్తోంది. కృష్ణ, గోదావరి జలాలను అనుసంధానించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆహ్వానించ దగ్గవే. పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే చూస్తూనే ఉన్నాం. ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కృష్ణా ఆయకట్టు మొత్తం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది. రాయలసీమలో 4 జిల్లాలు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడితే నన్ను విమర్శిస్తారా? నన్ను విమర్శించడం మానుకొని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించండి. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది' అని జగన్ అన్నారు. 
 
చంద్రబాబు పాలన వల్లే ఆంధ్ర రాష్ట్రం అధ్వానస్థితిలో పడిందని సీఎం జగన్‌ విమర్శించారు. గోదావరి నీళ్లు శ్రీశైలం, సాగర్‌కు తీసుకువెళ్లే కార్యక్రమం జరిగితే మంచిదే కదా అని ముఖ్యమంత్రి అన్నారు. 'శ్రీశైలం, సాగర్‌కు నీళ్లు వస్తే రెండు రాష్ట్రాలకు వాటాలుంటాయి కదా? గోదావరి జలాలు వస్తే ఏపీ, తెలంగాణలోని జిల్లాలు బాగుపడతాయి. నీళ్లు వస్తే సంతోషించాల్సింది పోయి విమర్శలు చేస్తారా? శ్రీశైలం, సాగర్‌  రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు శ్రీశైలం, సాగర్‌ మాకు కావాలని ఎందుకు అడగలేదు. గోదావరి జలాలు కృష్ణా ఆయకట్టుకు వస్తే మంచి విషయమే కదా? వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని హర్షించాల్సిందిపోయి రాజకీయాలు చేస్తారా?' అని జగన్ మండిపడ్డారు.