శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (15:07 IST)

ఆరోగ్యశ్రీలో చికిత్స పొందేవారికి శుభవార్త!

ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స తీసుకునే రోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్పత్రిలో చికిత్స మాత్రమే కాదు.. ఆ తర్వాతా అండగా ఉండబోతున్నట్టు ప్రకటించింది.

డిశ్చార్జ్ అనంతరం రోజుకు 225 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్టు తెలిపింది. వచ్చే డిసెంబర్ 1న ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే.. ఈ సౌకర్యం వర్తించనుంది. ఆరోగ్యశ్రీ పథకం అమలులో.. త్వరలోనే కీలక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది ప్రభుత్వం.

చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా.. రోగికి అండగా ఉండేలా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రోగి పూర్తిగా కోలుకునేవరకు.. రోజుకు 225 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. అయితే.. ఒక నెలకు ఈ సహాయం మొత్తాన్ని 5 వేల రూపాయలకు పరిమితం చేయనున్నట్టు తెలిపింది.

వచ్చే డిసెంబరు 1న ఈ తాజా నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన జీవో 550కి వివరణ జత చేస్తూ.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం చికిత్స సమయంలో డాక్టర్ కన్సల్టేషన్, వ్యాధి నిర్ధరణ పరీక్షలు, వైద్యం, సర్జరీ, మందులు, రోగులకు భోజన వసతి, డిశ్చార్జ్ సమయంలో ఆసుపత్రి నుంచి వారు ఇంటి వరకు వెళ్ళటానికి అయ్యే రవాణా ఖర్చులన్నీ ఆరోగ్యశ్రీలో భాగంగా అందిస్తున్నారు.

ఇకపై డిశ్చార్జ్ అనంతరం రోగి కోలుకునే వరకు నిపుణులు నిర్ణయించిన ప్రకారం అవసరమైనన్ని రోజులకు ఈ పథకం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన వివరణలో తెలిపింది.

ఈ నిర్ణయం ఎంతో మంది పేదవాళ్లకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికే ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ఉన్నట్టు చెప్పారు.