శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! 7వ వేతన సంఘ సిఫారసుల మేరకు జీతాల పెంపు.. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న ప్రతి వర్గానికీ ఎంతో కొంత ఊరట కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటమే ఇందుకు కారణం.

మొన్నటికి మొన్న కార్పొరేట్‌ పన్ను రేట్లు తగ్గించిన కేంద్రం వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లపైనా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఈ రేట్లను హేతుబద్ధీకరించడం ద్వారా మధ్య తరగతి వినిమయ శక్తిని పెంచి, వినిమయ మార్కెట్‌కు ఊపు తేవాలని భావిస్తోంది. పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వర్గానికీ కనీసం 5 శాతం మేర లబ్ధి చేకూర్చాలన్నది సర్కారు ఆలోచనలోని కీలకాంశం.

ముఖ్యంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి ఇకపై 10 శాతం పన్ను రేటును అమల్లోకి తేవాలన్నది ఒక కీలక ప్రతిపాదన. ఇప్పటిదాకా ఈ శ్లాబులో ఉన్నవారి నుంచి 20 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. 30 శాతంగా ఉన్న శ్లాబును 25 శాతానికి కుదించాలని కూడా భావిస్తున్నారు.

అలాగే ఆదాయపు పన్నుపై విధిస్తున్న సెస్సు, సర్‌చార్జ్‌లను పూర్తిగా ఎత్తివేసే ఆలోచన చేస్తుండటం మరో కీలకాంశం. ప్రత్యక్ష పన్నుల కోడ్‌పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఆగస్టులో తన నివేదిక అందజేసింది. ఆ నివేదిక ఆధారంగానే 5-10 లక్షల మధ్య ఆదాయ వర్గానికి సగానికి సగం పన్ను తగ్గింపు యోచన అన్నది సంబంధిత వర్గాల మాట.

ఈ చర్య ద్వారా ముఖ్యంగా మధ్య తరగతి చేతిలో మరింత సొమ్ము అందుబాటులోకి వచ్చేలా చేయాలన్నది సర్కారు యోచన. అదే సమయంలో రూ.2 కోట్లు లేదా అంతకుపైబడి వార్షికాదాయం ఉన్న అత్యంత ధనవంతుల కోసం కొత్తగా 35 శాతం పన్ను శ్లాబును అమల్లోకి తేవాలని కూడా యోచిస్తున్నారు.

ఇప్పటిదాకా ఉన్న గరిష్ఠ ఐటీ శ్లాబు 30 శాతం మాత్రమే.ప్రస్తుతం పన్ను చెల్లించనక్కర్లేని ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలుగా ఉండగా.. దానిని రూ.5 లక్షలకు పెంచాలని కూడా టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు చేసింది. కాకుంటే వివిధ రకాల రాయితీల ద్వారా రూ.5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను లేకుండా ప్రభుత్వం గత బడ్జెట్‌లోనే పలు చర్యలు ప్రకటించింది.

ఇప్పుడు ఈ టాస్క్‌ఫోర్స్‌ సిఫారసుల అమలుపై దీపావళికి ముందే కీలక ప్రకటన వెలువడనున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. మరోవైపు కేంద్ర ఉద్యోగులకు 7వ వేతన సంఘ సిఫారసులకు అనుగుణంగా జీతాల పెంపుపై దసరాకు ముందే కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

కనీస వేతనాలను కనీసం రూ.8 వేల మేర పెంచాలన్నది ప్రధాన డిమాండ్‌. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేలుగా ఉంది. జీతాల పెంపుపై కేంద్రం పండుగకు నిర్ణయం ప్రకటిస్తే అది 26 వేలకు చేరే అవకాశముంది.