శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (09:47 IST)

ఏపీలో మహిళలపై దురాగతాలు పెరిగిపోతున్నాయి: పరిటాల సునీత

మహిళా దినోత్సవం రోజునే వారిని మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెరలేపారని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. గత 21 నెలల పాలనలో మహిళలను అత్యంత వేధింపులకు గురిచేశారని తెలిపారు.

స్వయాన ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే ఒక మహిళను అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపేస్తే జగన్ రెడ్డి ఏమీ పట్టించుకోలేదు. టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్లి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేసే వరకు పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు.

పైగా తెలుగు మహిళాధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఇతరులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీనికి కారణం జగన్ రెడ్ది కాదా అని ప్రశ్నించారు. 

తన నియోజకవర్గంలోనే హత్యకు గురైన మహిళకు న్యాయం చేయలేని వారు, మహిళలకి ఏదో చేస్తానని చెప్పడం ఎన్నికాల స్టంట్ మాత్రమే. రవాణా మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని), అతని మద్దతుదారులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ జయలక్ష్మి అనే మహిళా ఆశా వర్కర్ ఆత్మహత్యకు యత్నించింది.

ఈ సంఘటన జూలై 13, 2020న మచిలిపట్నంలో జరిగింది. మంత్రి  నాని, అతని మద్దతుదారు ఎం. తులసి తనను వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు సూసైడ్ లేఖలో పేర్కొంది.

ఎన్నికలకు ముందు మద్య నిషేధం విధిస్తామని బూటకపు మాటలు చెప్పిన జగన్ నేడు వాటి అమ్మకాలమీద యేడాదికి రూ.5 వేల కోట్లకు పైగా జే ట్యాక్స్ పొందుతున్నాడు. మొబైల్ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.  

ముఖ్యంగా అమరావతి నిరసనలో మహిళలపై పెద్ద ఎత్తున పోలీసుల దాడులు జరిగాయి. ఇది పోలీసు వ్యవస్థ పనితీరుకు ఒక మాయని మచ్చ. శాంతియుతంగా పోరాడుతున్న ఎందరో మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లడం, కొట్టడం మరియు గంటల కొద్దీ వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సెప్టెంబర్, 2020లో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మహిళలపై దాడుల్లో ఆంద్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఊహించని స్థాయిలో పెరిగి 2019లో 17,746 కేసులు నమోదయ్యాయి.  

జూన్ 27, 2020న నెల్లూరులోని పర్యాటక శాఖ కార్యాలయంలో సహోద్యోగి అయిన ఒక దివ్యాంగ మహిళపై పర్యాటక శాఖ డిప్యూటీ మేనేజర్ అత్యంత దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమీషన్ (NCW) ఒక ప్రకటన విడుదల చేస్తూ "బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఒక మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడడం కమీషన్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని” పేర్కొంది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను జాతీయ మహిళా కమీషన్ ఆదేశించింది. 

బాలింతని బూట్ కాలితో తన్నారు, స్నానం చేస్తున్న మహిళను డ్రోన్ తో పోటోలు తీశారు. చిత్తూరులో డాక్టర్ అనితా రాణిపై దౌర్జ్యన్యాలు చేశారు.  
 
రేణిగుంట మండలం తుకివాకం గ్రామంలో 20 ఏళ్ళ యువతిపై చర్చ్ ఫాదర్ దైవసహాయం అత్యాచారం చేసాడు. ఈ ఘటనపై బాధిత మహిళ రెండురోజులుగా దిశా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎస్సై ఫిర్యాదుని స్వీకరించలేదు. కేసు నమోదు చేసుకోకుండా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని సూచించారు.

చివరికి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోకుండా సంబంధిత ఘటన తమ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగలేదని పేర్కొన్నారు.