మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (12:12 IST)

మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)

dr bhumika
ఓ యువ డాక్టరమ్మ తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసింది. ఒక్కగానొక్క కుమార్తె తమకు దక్కదన్న కొండంత దుఃఖాన్ని దిగమింగుకుని, అవయవాలను దానం చేసి బిడ్డ కోరిక తీర్చారు ఆమె తల్లిదండ్రులు.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపులు మండల నంగివాండ్లపల్లికి చెందిన నంగి నందకుమార్ రెడ్డి, లోహితల కూతురు భూమికారెడ్డి (24). ఇటీవలే వైద్య విద్య పూర్తిచేసి హైదరాబాద్ ఎల్బీ నగరులోని కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా వైద్య సేవలు అందిస్తోంది. 
 
ఈ నెల 1వ తేదీన హైదరాబాద్ నగర్‌లో భూమికారెడ్డి ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకోగా నానక్‌రామ్ గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. చివరికి వారం తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గతంలో భూమికారెడ్డి అవయవ దానంపై చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న తల్లిదండ్రులు. ఆమె అవయవాలు దానం చేసేం దుకు ముందుకొచ్చారు. 
 
వైద్యులు భూమికారెడ్డి నుంచి ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి అవసరమైన వారికి అవయమార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. భూమికా రెడ్డి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఆదివారం రాత్రి స్వగ్రామం నంగివాండ్లపల్లికి తరలించారు. భూమికారెడ్డి త్యాగం చిరస్మరణీయమని కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అన్నారు. 
 
దీనిపై ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ అంటూ కొనియాడారు. పుట్టెడు దుఃఖంలోను ఔదార్యం చూపిస్తూ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన భూమిక కుటుంబ సభ్యులకు సెల్యూట్ అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.