మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (09:32 IST)

సార్! అన్నతో పాటు నేనూ చనిపోతున్నా.. మా మృతదేహాలను ఇంటికి పంపండి: యువకుడు

సార్.. మా అన్న చనిపోయాడు.. అతనితోపాటు.. నేనూ చనిపోతున్నా... మా ఇద్దరి మృతదేహాలను భద్రంగా ఇంటికి పంపండి... అమ్మానాన్నలను ఏడవ వద్దని చెప్పాలని వేడుకుంటూ ఎస్‌ఐకు ఓ యువకుడు రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కన్నీర

సార్.. మా అన్న చనిపోయాడు.. అతనితోపాటు.. నేనూ చనిపోతున్నా... మా ఇద్దరి మృతదేహాలను భద్రంగా ఇంటికి పంపండి... అమ్మానాన్నలను ఏడవ వద్దని చెప్పాలని వేడుకుంటూ ఎస్‌ఐకు ఓ యువకుడు రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కన్నీరుపెట్టించింది. మెదక్ జిల్లా వంటిమామిడి దగ్గర జరిగిన ఈ హృదయవిదారక వివరాలను పరిశీలిస్తే... 
 
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన ఎర్రవల్లి గట్టయ్య ఇద్దరు కొడుకులు నవీన్(25), అనిల్(23) హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దసరా పండుగ కోసమని ఈనెల 8న గ్రామానికి వచ్చి... కుటుంబ సభ్యలతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఆ తర్వాత గురువారం ఉదయం బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు. మెదక్ జిల్లాలోని వంటిమామిడి శివారులో ములుగు వైపు నుంచి వస్తున్న కారు డివైడర్‌ను దాటి మరీ యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
సమాచారం అందుకున్న ములుగు ఎస్సై శ్రీశైలం యాదవ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి కొనప్రాణంతో ఉన్న అనిల్ ‘‘సార్ మా అన్న చనిపోయాడు. నేనూ చనిపోతా. మా అమ్మానాన్నలను ఏడవొద్దని చెప్పండి. నా ల్యాప్‌టాప్ నా స్నేహితులకు ఇవ్వండి. మా మృతదేహాలను ఊరికి తరలించండి’’ అని వేడుకున్నాడు. అతడి మాటలకు పోలీసులు సహా అక్కడున్న వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లోకి ఎక్కిస్తుండగా మృతి చెందాడు. 
 
విషయం తెలిసిన పచ్చునూరు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆనందంగా హైదరాబాద్ బయలుదేరిన కుమారులు విగతజీవులయ్యారని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ దబ్బెట వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.