సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (09:13 IST)

కృష్ణా జిల్లాలో జగన్‌కు షాక్.. టీడీపీలోకి బూరగడ్డ.. లోకేశ్‌ ద్వారా రాయబారం

కృష్ణా జిల్లాలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగలనుంది. వైకాపా సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్‌ తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ జా

కృష్ణా జిల్లాలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగలనుంది. వైకాపా సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్‌ తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు, వేదవ్యాస్‌ తనయుడు కిషన్‌తేజ్‌కు మధ్య స్నేహం కారణంగా ఇది సాకారమవుతున్నట్లు సమాచారం. ఇదే అంశంపై బూరగడ్డతో లోకేష్ రాయబారం నడిపి... పార్టీలోకి ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి బూరగడ్డ గత 2014 ఎన్నికలకు ముందే వేదవ్యాస్‌ టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగానే సాగింది. అయితే, స్థానిక పరిస్థితుల కారణంగా తెదేపా అధిష్టానం నుంచి అప్పట్లో ఆయనకు ఆహ్వానం రాలేదు. అయితే ఆయన అనూహ్యంగా పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి కాగిత వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. 
 
అప్పటి నుంచి నియోజకవర్గంలో అప్పుడప్పుడూ పర్యటించడం తప్పితే వైసీపీలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్‌తో, ఇతర నాయకులతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే అభిప్రాయం బలపడింది. దీనికి తగినట్లుగానే ఆయన గురువారం బందర్‌లోని తన స్వగృహంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. 
 
కాగా, మల్లేశ్వరం ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండు సార్లు గెలుపొందిన వేదవ్యాస్‌ 1993-94 మధ్య డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్‌ను వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. మచిలీపట్నం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనమైంది. కొంత కాలం పాటు ఆ పార్టీలో కొనసాగి 2014 ఎన్నికల్లో వైసీపీలోకి వచ్చారు. తాజా పరిణామాలతో ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.