చంద్రబాబుపై ''చెప్పు'' వ్యాఖ్యలకు.. విజయసాయిరెడ్డి నాన్‌బెయిలబుల్ వారెంట్‌కు లింకుందా?
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి వారెంట్, వైకాపా రాజ్యసభ అభ్యర్థి విజయసాయిరెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్‌ను సీబీఐ కోర్టు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు హాజరుకానందున విజయసాయిరెడ్డికి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది.
కాగా జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 10కి వాయిదాపడింది. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేక పోతున్నట్లు విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఇంకా విజయసాయిరెడ్డి గైర్హాజరుపై సీబీఐ కోర్టు సీరియస్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే జగన్ కేసులను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైకాపా శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష పార్టీలను నోరునొక్కేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.
అందుకే జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి నాన్‌బెయిలబుల్ వారెంట్‌కు లింకుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్‌పై నమోదైన అన్ని కేసుల విచారణను సీబీఐ కోర్టు వేగిరం చేసిందని వారు చెప్తున్నారు. కాగా సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం ఈ కేసును విచారిస్తోందని..ఈ క్రమంలో నిందితులంతా ప్రతి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలలో విచారణకు పలుసార్లు హాజరైన వైఎస్ జగన్... ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న తాను ప్రతివారం విచారణకు రావాలంటే కుదరదని కోర్టుకు విన్నవించుకున్నారు. జగన్ అభ్యర్థనను మన్నించిన కోర్టు.. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే జగన్‌కు కుడిచేయి లాంటి విజయసాయిరెడ్డిపై మాత్రం కోర్టు సీరియస్ అయ్యింది.
తాజాగా రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేసులో రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అనారోగ్యమని పిటిషన్ దాఖలు చేసినా పట్టించుకోలేదు. కోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఈ నెల 10న జరగనున్న తదుపరి విచారణకు సాయిరెడ్డి తప్పనిసరిగా హాజరవుతారని తెలుస్తోంది.