సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:31 IST)

విశాఖ ఉక్కుపై ఏ1 - ఏ2ల కన్నుపడింది : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

ఉత్తరాంధ్రపై కన్నేసిన ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి.. విధ్వంసానికి శ్రీకారం చుట్టారని టీడీపీ మాజీ మంత్రి సీహెచ్.అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. విశాఖలో భూములపై కన్నేసి.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఇపుడు విశాఖ ఉక్కుపై కన్నేశారన్నారు. ఇందులోభాగంగా ఉత్తరాంధ్ర విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘20 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొట్టేయటానికి ఈ దొంగల ముఠా స్కెచ్ వేసింది. అందుకే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపారు. బినామీ కంపెనీ చేత ఈ స్టీల్ ప్లాంట్ కొనబోతున్నారు. ఇందులో ఏ కుట్రా లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్‌ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అని చాటి చెప్పాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వాళ్లు రూ.వెయ్యి కోట్లతో స్టీల్ ప్లాంట్ కొనలేరా?’’ అని ప్రశ్నించారు. 

అలాగే, మరో టీడీపీ నేత కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, విశాఖను రాజధాని చేస్తామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.. కేసులకు భయపడి కేంద్రం చెప్పినట్టు  ఆడుతున్నారని ఎద్దేవాచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అంగుళం ప్రైవేటీకరణ చేసినా సహించేది లేదని హెచ్చరించారు. హుద్‌హుద్‌ తుఫాను సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు అక్కడే ఉండి విశాఖ నగరానికి పునర్‌వైభవం తీసుకువచ్చాకే అమరావతికి వచ్చారని గుర్తు చేశారు.