మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జులై 2020 (17:21 IST)

హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టు - 14 రోజుల రిమాండ్ - రాజమండ్రి జైలుకు తరలింపు

మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ తరలించారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. 
 
కాగా, ఈ హత్య కేసుపై జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాతో మాట్లాడారు. ఇదంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం అని, రాజకీయపరంగా, కులపరంగా ఎదుగుతున్నాడని మోకా భాస్కరరావును చంపారని తెలిపారు. 
 
మచిలీపట్నంలో మోకా భాస్కరరావుకు నాంచారయ్య అలియాస్ చిన్నాకు మధ్య ఎన్నో ఏళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయని, 2013 నుంచే మోకా భాస్కరావును చంపేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఇన్నాళ్లకు అతడిని చంపగలిగారని వివరించారు. 
 
ఇందులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర గురించి చెబుతూ, నిందితులకు అన్నివిధాలుగా అండగా నిలిచారని, ఓ పెద్దన్న తరహాలో వ్యవహరించారని, తన పేరు బయటికి రాకుండా చూసుకునే ప్రయత్నాలు చేసినా, అరెస్టయిన నిందితులు మొదట ఆయన పేరే చెప్పారని ఎస్పీ వివరించారు.
 
ఈ హత్య గురించి కొల్లు రవీంద్రకు అన్నీ తెలుసు. వాళ్ల ప్రణాళికలో భాగస్వామి కావడమే కాదు, వారికి అన్ని విధాలుగా సహకరించాడు. సాంకేతికపరమైన డేటా పరిశీలించిన తర్వాత, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే కొల్లు రవీంద్ర ఇందులో నిందితుడు అని నిశ్చయించుకున్నాం. నోటీసులు ఇవ్వాలని పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. 
 
అయితే, అంతకుముందే ఆయన ఇంటి వెనుక గోడదూకి పారిపోయారని తెలిసింది. దాంతో మాకున్న సమాచారం ఆధారంగా పోలీసు బృందాలను గాలింపు కోసం పంపించాం. శుక్రవారం సాయంత్రం తుని వద్ద స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించాం అని వివరించారు.