ఏసీబీ అదుపులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు... రహస్య ప్రదేశంలో...
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడిని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఓ రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలపై గతంలో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించగా.. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉండడంతో ఆయనను, మరి కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకున్నారు.
అచ్చెన్నాయుడు నిమ్మాడలో ఉన్నట్టు తెలుసుకున్న ఏసీబీ అధికారులు గురువారం అర్థరాత్రి నిమ్మాడకు వంద మందికిపైగా పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ చెబుతున్న జగన్ ప్రభుత్వం.. ఫైబర్ నెట్, రంజాన్ తోఫా చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ చేయించాలని నిర్ణయంచింది. ఇదేసమయంలో ఏపీలో ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. వీటిపై కూడా జగన్ సర్కారు దృష్టిసారించింది. ఇందులోభాగంగానే అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుంది.
నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని, టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో టెండర్లు కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని ఆరోపిస్తున్నారు. దీంతో అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.