నెల్లూరు అభ్యర్థిని గెలిపిస్తారా లేదా.. ఉరుముతున్న బాబు: ఇన్నాళ్లకు గుర్తొచ్చామా నాయకా అంటున్న నేతలు
ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులను గెలిపించుకున్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా పార్టీలో తిరుగుబాటు సంకేతాలు గమనించి జిల్లానేతల వెంటబడుతున్నారు. అభ్యర్థి ఓడిపోతే అందరి కథ చెబుతా అంటూ తనదైన శైలిలో బెదిరిస్త
ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులను గెలిపించుకున్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా పార్టీలో తిరుగుబాటు సంకేతాలు గమనించి జిల్లానేతల వెంటబడుతున్నారు. అభ్యర్థి ఓడిపోతే అందరి కథ చెబుతా అంటూ తనదైన శైలిలో బెదిరిస్తున్నా పాచికలు పారకుండా పోవడంతో తల పట్టుకుంటున్నారు. ఓటర్లను కట్టడి చేయకపోతే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని నేరుగా హెచ్చరిస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తమను కుక్కల్లాగా చూసి ఈసడించుకున్న నేతలకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కరకు వచ్చామా అంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్న నేతలు విదేశాలకు వెళ్లడానికైనా సిద్ధపడతామంటున్నారు తప్పితే అధినేత మాట లెక్కచేయడం లేదు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోవూరు, సూళ్లూరుపేట నియోజక వర్గాల్లో చెలరేగిన తిరుగు బాట్లను ఎలా కట్టడి చేయాలని తెలుగు దేశం పార్టీ ముఖ్యులు కిందా మీదా పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఓటర్లను తన్నుకుపోవాలని వేసిన ఉపాయం తిరగబడి తమ ఓటర్లే తరలి పోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఓటర్లు జారుకోకుండా చూసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. కోవూరులో మరింత నష్టం జరక్కుండా రంగంలోకి దిగాలని పార్టీ సీనియర్ నాయకుడు పెళ్లకూరు శ్రీని వాసులురెడ్డి మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు ససేమిరా అంటూ ఆయన ఇరాన్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసు కున్నారు. వాకాటి నారాయణరెడ్డి సొంత నియోజకవర్గం సూళ్లూరుపేటలో సైతం తిరుగుబాట్లు ప్రారంభం కావడం అ«ధి కార పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తోంది.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన మూడేళ్లలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్‌లకు విలువే లేకుండా పోయింది. వారి పరిధిలో వృద్ధాప్య ఫించన్ ఇప్పించు కోవాలనుకున్నా జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదు. నీరు–చెట్టు, రోడ్లు లాంటి ఏ పనులు చేపట్టినా వీరికి ప్రాధాన్యత లేకుండా చేశారు. పైపెచ్చు పార్టీలో సైతం వలస నాయకులకే పదవులు కట్టబెడుతూ వస్తున్నారు. ఈ పరిణామాలతో మనసు లోనే ఆందోళనతో ఉన్న ఎంపీటీసీలు ఆత్మాభిమానం జెండా పైకెత్తారు. మాకు విలువ లేనప్పుడు ఎవరైతే మాకేంటి అనే నిర్ణయానికి వచ్చారు.
కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగుర వేసిన ఎంపీటీసీలు టీడీపీతో తాడో పేడో తేల్చుకోవడానికి వైఎస్సార్ సీపీలో చేరా రు. ఈ తిరుగుబాటు సూళ్లూరుపేటకు సోకింది. మంత్రులు నారాయణ, శిద్ధా రాఘవరావు, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు బీద రవిచంద్రకు ఎన్నికల బాధ్యత అప్ప గించిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాలపై సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల సీటు ఓడిపోతే తీవ్ర పరిణామాలుంటాయని వారిని హెచ్చరిం చారు. ఏం చేసైనాసరే ఎన్నికల్లో గెలవాలని, అధికార యంత్రాంగాన్నీ వాడుకోవాలని ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా మంత్రి నారాయణతో పాటు పార్టీ ముఖ్య నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద రవిచంద్ర నష్ట నివారణకు చర్చల మీద చర్చలు జరుపుతూ నేరుగా రంగంలోకి దిగారు.
కోవూరు నియోజకవర్గంలో పరిస్థితి సర్దుబాటు చేయడానికి బాధ్యతలు తీసుకోవాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పార్టీ సీనియర్ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మీద ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ద్వారా కూడా చెప్పించారు. పార్టీ అధిష్టానంతో పాటు, జిల్లా పార్టీ ముఖ్యుల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. అంతా అయిపోయాక తాను వెళ్లి ఏం చేయాలని ఆయన సైతం ససేమిరా అంటున్నారు. పార్టీ ముఖ్యుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఒకటి, రెండు రోజుల్లో ఇరాన్‌కు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీల బాధ్యతను సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లేదా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అప్పగించేందుకు పార్టీ హై కమాండ్ యోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బాధ్యతలు తీసుకోవడానికి వారు కూడా వెనకడుగు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
టీడీపీ ఓటర్లు ఎవరూ వైఎస్సార్‌సీపీ వైపు వెళ్లకుండా చేయడానికి అనుమానం ఉన్న వారి మీద పోలీసు బలం ప్రయోగించాలని టీడీపీ ముఖ్య నేతలు నిర్ణయించారు. దీంతో పాటు వైఎస్సార్ సీపీకి ఓటర్లు, ఆ పార్టీకి మద్దతు తెలిపే టీడీపీ ఓటర్లను కట్టడి చేయడానికి పోలీసు అధికారులను నేరుగా రంగంలోకి దించాలని తీర్మానించారు. వైఎస్సార్ సీపీ నేతల మీద తమ వారితో తప్పుడు ఫిర్యాదులు చేయించి వారి మీద తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించే కుట్రలు పోలీసులతోనే అమలు చేయించే ఎత్తుగడకు తెరలేపారు. ఈ ఎత్తుగడలో తొలి భాగంగా గూడూరు డీఎస్‌పీ శ్రీనివాసులు, సూళ్లూరుపేట సీఐ రత్తయ్యను శుక్రవారం రంగంలోకి దించారు.
నాయుడు పేట మండలం విన్నమాల ఎంపీసీటీ కుంజేటి రమణమ్మ చేత వైఎస్సార్ సీపీ నేతలు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, షేక్ రఫీ, చంద్రారెడ్డితో పాటు మరింత మంది మీద గురువారం పోలీసులకు రాత్రి ఫిర్యాదు చేయించారు. కేసు నమోదైందే తడవుగా శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు వీరి ఇళ్లను చుట్టుముట్టి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. వారికి వార్నింగ్‌లు కూడా ఇచ్చి అధికార పార్టీ పట్ల తమ భక్తిని చాటుకున్నారు. చిట్టమూరు మండలం మల్లాంకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీటీసీలు స్వచ్చందంగా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలిపినా వారిని బలవంతంగా తీసుకుని వెళ్లి టీడీపీ నేతలకు అప్పగించారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడే కొద్దీ పోలీసు బలప్రయోగం పెంచేందుకు టీడీపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు.